జొహరాపురం ప్రజల సమస్యలు తీరుస్తా.. టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జొహరాపురంలో నెలకొన్న సమస్యలన్నింటినీ తాను పరిష్కరిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. తనను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తానని హామీ ఇచ్చారు. గురువారం జొహరాపురంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ కర్నూలు నగరం అభివ్రుద్ది చెందాలంటే తనను గెలిపించాలని కోరారు. తాను గెలిచిన తర్వాత కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఒక్క కంపెనీ వచ్చినా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ప్రజలు ఆలోచించాలని కోరారు. తనను ఎమ్మెల్యేగా చేసుకొని తన పనితీరు చూడాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తనదని టిజి భరత్ భరోసా ఇచ్చారు. కర్నూలు నగరంలోని ప్రజలు మురుగు కాలువల సమస్యతో పాటు, త్రాగునీటి కష్టాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లతో పాటు కనీస మౌలిక సదుపాయాలు లేక పడుతున్న ఇబ్బందులు తాను చూశానన్నారు. తాను గెలిచిన వెంటనే వీటన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు. ఐదేళ్లకోసారి వచ్చే ఓటు హక్కును ప్రజలు సరైన విధంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు ఇళ్ల పట్టాల సమస్యలు, పింఛన్ల సమస్యలు, మురుగు కాల్వల సమస్యలు ఆయనకు చెప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మోహన్, మాధవస్వామి, శ్రీనివాసులు, శాంతన్న, బలస్వామి, వెంకటయ్య, తిమ్మోజి, వెంకటేష్ గౌడ్, శ్రీనివాసులు గౌడ్, శాంతమ్మ, చిట్టెమ్మ, ఎల్ల గౌడ్, తదితరులు పాల్గొన్నారు.