PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: AIUTUC అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ గ్రామ పంచాయతీ శానిటరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సంవత్సరం పైగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, గుర్తింపు కార్డులు, ఇతర పనిముట్లు, మాస్కులు, పి‌ఎఫ్ మరియు ఈ.ఎస్.ఐ. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజ్ విహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. జి సృజన గారికి కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వగా, సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి AIUTUC జిల్లా కార్యదర్శి ఎం. నాగన్న అధ్యక్షత వహిస్తూ – గ్రామ పంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా తమ సేవలను సమాజానికి అందిస్తూ, గ్రామాలను పరిశుభ్రం చేస్తూ ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఐసోలేషన్ మరియు క్వారెంటైన్ సెంటర్లలో కూడా పని చేశారని గుర్తు చేశారు. వారికి దాదాపుగా 18 నెలలుగా జీతాలు అందక సతమతమవుతున్నారని, అప్పులు చేసి ఇబ్బందులు పాలయి తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నప్పటికి, మరోపక్క పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు జీతాలు రాక పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు పస్తులు వుంటు కూడా ప్రతిరోజు గ్రామాలు శుభ్రం చేస్తున్నారని అన్నారు.అనంతరం గ్రామ పంచాయతీ శానిటరీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ మాట్లాడుతూ – గత ఫిబ్రవరి నెల 3వ తేదీన తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారని, దానికి ప్రతిస్పందనగా పంచాయతీ రాజ్ కమిషనర్ గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారి నుండి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారులకు మెమోలు, ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కనీసం వారి వైపు కూడా చూడడం లేదని విమర్శించారు.అనంతరం నిరసనకు మద్దతుగా AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం.తేజోవతి మాట్లాడారు… కార్యక్రమంలో AIUTUC సభ్యులు బాబు, విశ్వనాథ్, చక్రి మరియు గ్రామ పంచాయతీ శానిటరీ వర్కర్స్ యూనియన్ జిల్లా సభ్యులు సిద్ధయ్య, దేవపాల్, నాగరాజు, ఆదిలక్ష్మి, మధు, మిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author