అర్జీల పరిష్కారం సత్వరం జరగాలి
1 min read
అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ధ్యేయం
పిజిఆర్ఎస్ లో 391 అర్జీల రాక
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్ యస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితోపాటు జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్,డిఆర్డిఏ పిడి ఆర్.విజయరాజు, జెడ్పి సిఇఓ శ్రీహరి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం పిజిఆర్ఎస్ లో 394 అర్జీలు అందాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ యస్ లో వచ్చిన సమస్యల అర్జీలను పెండింగు లేకుండా వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రతి అర్జీని పరిశీలించి ఎండార్స్మెంట్లను ఇవ్వాలని, సంబంధిత ఆర్డీవోలు వారి పరిధిలోని మండలాలలో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు.రీ ఓపెన్ కి అవకాశం లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చేయాలన్నారు.ఆయా కార్యాలయాలకు పిజిఆర్ యస్ కింద అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజలను ఆప్యాయతతో పలకరించి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించాలని అన్నారు.
అందిన అర్జీలలో కొన్ని
ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామానికి చెందిన తోట జయరాజు అర్జీనిస్తూ తమ వ్యవసాయ భూమి సర్వే రాళ్ళు ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్నారని, ఈ విషయంపై విచారణ చేసి తమ భూమిని తిరిగి ఇప్పించాలని కోరారు, ఏలూరు చేపలతూము సెంటర్ కు చెందిన దొర మంగ అర్జీనిస్తూ తన భర్త మతిస్థిమితం లేక ఇంటి బయటకు వెళ్ళి నెల రోజులు అయ్యింది.వారి జాడతెలుసుకునేందుకు చర్యలుతీసుకోవాలని కోరారు. తమది నిరుపేద కుటుంబమని,తమ పరిస్ధితిని పరిశీలించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన కుందేటి సరోజిని తన భర్త చనిపోయి రెండు ఏళ్ళు అయ్యిందని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,జిల్లా కలెక్టరేట్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.