రీసర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి
1 min read– సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: రీసర్వే కార్యక్రమాన్ని పక్కాగా పకడ్బందీగా చేపట్టాలని సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లు జేసి లకు సూచించారు.గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుండి సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్ లు, జేసిలతో సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అన్నమయ్య జిల్లా స్థానిక కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీ య డిఆర్ ఓ సత్యనారాయణ, ల్యాండ్ అండ్ సర్వే ఏడి జయరాజు,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిసిఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.జిల్లాలో సర్వే టీం గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆ దిశగా సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి సంబంధిత అధికారులు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు జరిగిన రీసర్వేలో ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులపై దృష్టి పెట్టి ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత మెరుగ్గా రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రీ సర్వేలో ముఖ్యంగా జాయింట్ ఖాతా, డిస్ప్యూట్స్, ఆక్రమణలు, పొజిషన్ మార్పులలో ఇబ్బందులు, తదితర సమస్యలు ఉంటాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించుకోవాలన్నారు.రీసర్వే అంశంలో భాగంగా గ్రామాలలో మాడ్యుల్స్ అన్ని పక్కాగా పూర్తి చేయాలన్నారు.తాసిల్దార్లు, ఆర్డీవోలు రీసర్వే జరుగుతున్న గ్రామాన్ని తప్పకుండా సందర్శించాలని సూచించారు. రీసర్వే పూర్తయిన చోట ఏదేని కారణాలవల్ల ఇంకా భూహక్కు పత్రాలు పంపిణీ చేయని గ్రామాలలో సమస్యలు పరిష్కరించుకొని త్వరితగతిన భూహక్కుపత్రాలు పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే గ్రామాలలో రైతులందరికీ నోటీసులు జారీ చేసి సర్వే పూర్తయిన తర్వాత తప్పకుండా రైతులతో సంతకాలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని సర్వే సిబ్బంది తాసిల్దార్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని నిర్దేశించిన కాల పరిమితిలోగా సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ గిరిష పిఎస్ అధికారులతో మాట్లాడుతూ…. రీ సర్వే కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో సర్వే పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు. రీ సర్వే వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు.సర్వే పనులను అధికారులు బాధ్యతగా తీసుకొని నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలన్నారు.