PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు హక్కును బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలి

1 min read

ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగ పరుచుకోవాలి

సమాజ శ్రేయస్సు కోసం మీ ఓటు హక్కును వినియోగించుకోండి

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విలువైన ఓటు హక్కును సమాజ శ్రేయస్సు కోసం ఓటర్లు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పిలుపునిచ్చారు.గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని మనకు అందించిన గణతంత్రదినోత్సవాన్ని ఒక రోజు ముందు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు.  ఓటు హక్కును బాధ్యతగా అందరూ సద్వినియోగం చేసుకోవడం వల్ల హక్కుల కోసం పోరాడే అవకాశం, జరిగిన తప్పులను నిలదీసే హక్కు ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో మొత్తం జిల్లాలో 76 శాతం ఓటింగ్ జరిగితే, కర్నూలు పట్టణంలో కేవలం 56 శాతం మాత్రం ఓటింగ్ శాతం నమోదు అవ్వడం జరిగిందన్నారు.  గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ శాతం పట్టణాలలో సౌకర్యాలను, ఎక్కువ సర్వీసులు పొందుతూ రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఉండకూడదన్నారు.  గత ఎన్నికల్లో “నో ఓటర్ లెఫ్ట్ బిహైండ్” అని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సంవత్సరం ఎన్నికల కమీషన్  “Nothing like Voting, I Vote for Sure” అనే నినాదంతో అందరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతోందన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే బాధ్యతను మనం అందరం గుర్తుంచుకొని భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకోవాలన్నారు. ఇప్పటికీ ఇంకా ఎవరైనా ఓటు హక్కు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై అభ్యర్థులు ఖరారు అయ్యేలోపు ఓటు హక్కు నమోదు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 22వ తేదిన ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరిగింది, సదరు జాబితాను పోలింగ్ కేంద్రాలలో, తహశీల్దార్ కార్యాలయాలో ఉంచడం జరిగిందని, అదే విధంగా ఈసిఐ సపోర్ట్ వెబ్సైట్ లో చెక్ చేసుకొని లేకపోతే ఓటు హక్కు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడం మన అందరీ బాధ్యత అని అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహించడం జిల్లా యంత్రాంగం బాధ్యత అయితే ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓటర్స్ మీద అంతే ఉంటుందన్నారు. ఎన్నికల రోజున సెలవు ఇచ్చారని ఇంటి దగ్గర ఉండకుండా ఆ రోజు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇచ్చిన సెలవు అని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సారి ఎన్నికల్లో 85 శాతం పైబడి ఓటింగ్ హక్కును వచ్చేలా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ప్రతి ఓటరు ఓటు వేసి కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించాలన్నారు. 1950వ సంవత్సరం జనవరి 25వ తేదిన భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తరువాత జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు.  దాదాపు సంవత్సర కాలం నుండి ఎన్నికల సమ్మరీ రివిజన్ జరుపుకుంటున్నామన్నారు.జిల్లా ఎన్నికల అధికారి  ఆధ్వర్యంలో ఓటర్ లిస్టును ప్యూరిఫై చేయడం జరిగిందన్నారు..ఇంటింటి సర్వే నిర్వహించి జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని, ఇంకా మిగిలిపోయిన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరణించిన వారిని ఓటర్ లిస్ట్ నుండి తొలగించడం, రెండు ప్రాంతాలలో ఓట్లు ఉంటే ఒక ప్రాంతంలో తొలగించడం వంటి ప్రక్రియలు చేపట్టి, జనవరి 22వ తారీఖున ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందన్నారు. ఎన్నికలలో వినియోగించే ఈవీఎం యంత్రాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాక్ పోల్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఈవీఎం మెషిన్లపై ఎలాంటి అపోహలు లేకుండా  ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు మాట్లడుతూ నూతనంగా ఓటు నమోదు చేసుకున్న విద్యార్థులు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కును సాధించుకోవడం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగం చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని యువత ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం యువతకే ఉందన్నారు. అందరూ ఓటు హక్కును గురించి తెలుసుకొని మసులుకోవాలన్నారు. మన భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకులను మనం ఎన్నుకోవాలన్నారు. అదే విధంగా ఓటు హక్కును బాధ్యతయుతంగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్లు ఓటు హక్కు పై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన బిఎల్ఓ లకు సర్టిఫికెట్లు అందజేశారు.అనంతరం పిడబ్ల్యుడి, సీనియర్ సిటిజన్ ఓటర్లను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దుశాలువ, జ్ఞాపికతో సత్కరించారు.యువ ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు, నోడల్ ఆఫీసర్ (ఎస్సీ కార్పొరేషన్ ఈడీ) శ్రీనివాస్ కుమార్, సెట్కుర్ సీఈఓ రమణ, కల్లూరు తహశీల్దార్ రమేష్ బాబు, ఎన్నికల విభాగపు సూపరింటెంట్ మురళీ, వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author