వైసీపీ నాయకుడి బరి తెగింపు..?
1 min read– మునక భూమి 150 ఎకరాలు స్వాహా కు కుట్ర..
– కృష్ణానది లో చేపల వేట”పట్టు” కోసమేనా..?
– వైసీపీ నాయకుడికి రౌడీషీటర్ల అండా.
– న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన గ్రామస్తులు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కృష్ణానది వెనుక జలాలలో అక్రమంగా పట్టు వలలతో చేపల వేట సాగించి లక్షల రూపాయల ఆదాయం పొందుతూ డబ్బు రుచి మరిగిన వైసీపీ నాయకుడి కన్ను మునక భూమి 150 ఎకరాల పైన పడింది. ఎలాగైనా ఆ భూమిని స్వాధీనం చేసుకుని దర్జాగా చేపల వేట సాగించ వచ్చని ఇద్దరు రౌడీ షీటర్ల మద్దతుతో కుట్ర పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు న్యాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నాయకుడి పైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పులేంద్ర నాయుడుపై పీకే ప్రాగటూర్ గ్రామస్తులు ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.పీకే ప్రాగ టూర్ గ్రామ పరిధిలోని సుమారు 150 ఎకరాల మునక భూమిని ఆక్రమించాలని కుట్ర జరుగుతోందని గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు.45 ఏళ్లుగా ఆ భూముల కౌలు ద్వారా వస్తున్న ఆదాయంతో గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నామని మా భూములను ఆక్రమించుకోవడాని ఇద్దరు రౌడీ షీటర్ల సహకారంతో కుట్రలు చేస్తున్నారని గ్రామస్తులు వెల్లడించారు. అధికార పార్టీ నాయకుడు భూములు ఆక్రమించుకోవాలని కుట్ర చేస్తున్నాడని గ్రామస్థులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అధికార పార్టీవారు కావడంతో చూసీ చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చేపల వేట పట్టు కోసమేనా..?
పీకే ప్రాగటూర్ గ్రామ సమీపంలోని శ్రీశైలం మునక భూమి 150 ఎకరాలు ఉంది. ఈ భూముల కౌలు ఆదాయాన్ని గ్రామంలో పండుగ ఉత్సవాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, దేవాలయాల నిర్వహణ అవసరాలకు ఉపయోగిస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెహ్రు నగర్ కు వైసీపీ నాయకుడి కన్ను భూమిపై పడింది. ఎలాగైనా కబ్జా చేయాలని నిర్ణయించుకున్నాడు.గతంలో గంగమ్మ గుడి నిర్మాణం పేరుతో పాత తిప్పను చదును చేసి దాదాపు 20 ఎకరాల మునక భూమిని ఆక్రమించాడు. ఈ మునక భూమిలో ప్రతి ఏడాది పట్టు వలతో అక్రమంగా చేపల వేట కొనసాగుతుంది. ఏడాదికి దాదాపు రూ. నాలుగు లక్షల ఆదాయం వస్తోంది. ఆదాయం రుచి మరిగిన వైసీపీ నాయకుడి కన్ను 150 ఎకరాల భూమి పై పడింది.
గ్రామస్తుల ఫిర్యాదు ఇలా..
గతనలభై సంవత్సరాలుగా మా గ్రామం లోని ప్రజలంతా ఐక్యమతంగా ఉంటూ జీవించుచున్నాం. మాపెద్దల నుంచి వచ్చిన కట్టు బాట్లను పాటిస్తూ గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటికి కావలసిన ఆర్థిక వనరులైన మా నీటి ముంపు గ్రామం పాత కొండప్రాగటూరు అనబడే గ్రామంలోని శివాలయం మునకు సంబందించిన భూముల నుండి వచ్చు వాటితో అభివృద్ది చేసుకుంటున్నాం. వాటితో దూప దీపదైవైద్యాలు, గ్రామానికి మంచి నీటిసరఫరా కొరకు శుభ కార్యక్రమాలకు విని యోగించుకుంటున్నాం. ప్రస్తుతం పాత రౌడీ షీటర్ అయినటువంటి మండ్ల సుధాకర్ నాయుడు , వైసీపీ నాయకుడు ఫులేంద్ర నాయుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దౌర్జన్యంగా ఈ సంవత్సరం శివాలయంనకు సంబంధించిన భూముల యందు చేపల వేట సాగిస్తున్నారు. ప్రశాంతంగా గ్రామంలో మళ్ళీ ఎక్కడా ప్యాక్షన్ మొదలవుతుందో నని గ్రామ ప్రజలు భయ పడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని గ్రామస్తులు తెలిపారు.