పూర్వ ప్రాథమిక విద్యలో కథల పాత్ర.. కీలకం..
1 min read– సైకాలజిస్ట్ డాక్టర్ ఎం. వరలక్ష్మి
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: ఆరేళ్ల లోపు పిల్లల విద్యలో మెదడు అభివృద్ధి ని ప్రేరేపించే రకంగా బోధనా పద్ధతులను, విధానాలను ఎంపిక చేసుకోవాలన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డా. వరలక్ష్మి. అందులో భాగంగా పరిశోధనల ప్రకారం మరియు పలు విద్యావేత్తలు జిజుబాయి మరియు ప్రొబెల్ అనుభవపూర్వక అభిప్రాయం మేరకు, కథలు పిల్లల్లో సంజ్ఞానాత్మక వికాసం,మానసిక వికాసం, శారీరక వికాసం, భాషా వికాసం,నైతిక వికాసం,సామాజిక వికాసం పై విపరీతమైన ప్రభావం చూపుతూ సమగ్ర మూర్తిమత్వ వికాసానికి దోహదపడతాయి.
జ్ఞానం కంటే ఊహాశక్తి చాలాగొప్పది :
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ !.జ్ఞానం కంటే ఊహా శక్తి గొప్పది అన్నారు..ఈ మాట అక్షరాలా నిజం. పిల్లల్లో ఊహా శక్తిని పెంపొందించడానికి కథ చెప్పడం ఓ చక్కని మార్గం. అనగనగా……. అనగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్ళి పోతారు. కథలోని పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. దృశ్యాన్ని చూసినంత అనుభూతి చెందుతూ కొన్ని అలవాట్లను కూడ పెంపొందించుకుంటారు. కథ వినడం వల్ల పిల్లలు కొత్త కొత్త పదాలు వాటి అర్థాలు తెలుసుకుంటారు. వినగలిగే చెప్పగలిగే సామర్థ్యత పెరిగి భాషా వికాసం జరుగుతుంది. భావ ప్రసార నైపుణ్యాలు మెరుగుపడతాయి. కథల ద్వారా పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడంతో పాటు కట్టుబాట్లను అర్థం చేసుకుంటారు. ఇంద్రియ ప్రేరేపనతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మంచి ఉద్దేశపూర్వకరమైన కథ విన్నప్పుడు పిల్లల్లో ఆక్సిటోసిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ పిల్లల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది. దీని వల్ల వారిలో స్నేహం, ప్రేమ, ఆత్మీయత , ఆప్యాయత మరియు సానుభూతి, సహానుభూతి వంటి భావనలు కలుగుతాయి. బాధల విలువ తెలుస్తుంది. కథలోని విషయాలు పిల్లల మెదడును ఎంతగానో ప్రేరేపిస్తూ ప్రభావితం చేస్తాయి. అందుకే నూతన జాతీయ విద్యా విధానము ద్వారా ప్రవేశ పెట్టబోతున్న పూర్వ ప్రాథమిక స్థాయిలో కథా పద్దతి ఎంత ఉపయోగకరమో అన్న విషయాన్ని రాయచోటి ప్రభుత్వ శిక్షణాసంస్థ లో ఛాత్రో పాధ్యాయులు, వారి ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు మరియు సైకాలజిస్ట్ డా.యం. వరలక్ష్మి గారి ఆధ్యర్యంలో కళా సమ్మిళిత వినూత్న బోధనా పధ్ధతుల్లో ఒకటిగా ఎంచుకుని కథలు చాలా ఉపయోగకరమని ప్రయోగాత్మకంగా తెలుసుకుని అనుసరిస్తున్నారు.