పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకం.. టి.జి భరత్
1 min read– బుధవారపేటలో పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసిన టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమాజంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని బుధవారపేటలో మాజీ కార్పోరేటర్ పామన్న పారిశుద్య కార్మికులకు చీరలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి.జి భరత్ పాల్గొని పారిశుధ్య కార్మికులకు చీరలు అందజేశారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం పనిచేసే విభాగాల్లో అతి కష్టమైనది శానిటేషన్ విభాగమన్నారు. పారిశుధ్య కార్మికులు వాడవాడనూ శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడేందుకు కష్టపడతారన్నారు. తమ ప్రభుత్వం వస్తే పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాలు కాపాడేందుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన కిట్లను అందిస్తామన్నారు. ఈ సందర్బంగా స్థానికులు టిజివి కుటుంబం స్థానికంగా ఉన్న ఆలయంకు విరాళమిచ్చిన విషయాన్ని టిజి భరత్ కు గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా తాము 40 ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్నట్లు భరత్ తెలిపారు. అధికారంలో ఉంటే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. స్థానికంగా మరుగుదొడ్ల సమస్య ఉందని ప్రజలు టి.జి భరత్ కు తెలిపారు. తాను గెలిచిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు అక్కడున్న సుంకులా పరమేశ్వరీ ఆలయంలో టిజి భరత్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జేమ్స్, రామయ్య, రామక్రిష్ణబాబు, వినయ్, చంద్రశేఖర్, బార్గవ, సత్యనారాయణ, హరిబాబు, గిరి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.