అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
1 min read– సమ్మె బాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో నందికొట్కూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుండి అంగన్వాడీలు సమ్మె బాటపట్టారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.అందులో భాగంగానే తహశీల్దార్ కార్యాలయం ముందు ఐఎఫ్ టీయూ నాయకులు లాజరస్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మజీద్ మియ్య, అఖిల భారత రైతు సంఘం నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయడం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయకపోగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పని భారం నుంచి అంగన్వాడీలను మనోవేదనకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేతనం ఇస్తానని చెప్పి విస్మరించారని అన్నారు.కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. .తెలంగాణ కన్నా అదనంగా రూ 1000 వేతనం ఇస్తానని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డి మాటలు ఏమైనాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని తక్షణమే అమలు చేయాలన్నారు. అలాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ కేటాయింపులు చేసి నిధులు పెంచి, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పారు. అర్హులైన హెల్పర్స్ కు ప్రమోషనుల నిబంధనలను రూపొందించి, ప్రమోషన్ల వయస్సు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 2017 టిఏ, డిఏతో పాటు ఇతర బకాయిల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తామని, సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.అనంతరం తహశీల్దార్ రాజశేఖర్ బాబు కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సామేలు అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు సుధాకర్ ,పీడబ్ల్యూ నాయకురాలు చూరిబీ, లక్ష్మీదేవి, బీబీ, అంగన్వాడి వర్కర్ సువర్ణమ్మ, కుసుమ, హెల్పర్స్ సరోజమ్మ , చిట్టెమ్మ, కంపన, స్వామిదాసు, మహబూబ్ బాషా, శేఖర్, శ్రీనివాసులు,భార్గవ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.