అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలి
1 min readప్రజలతో పాటూ ఆ పార్టీ నాయకులకు కూడా విరక్తి కలిగింది..
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి
28వ డివిజన్ లో ప్రజాసంకల్పయాత్ర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దోపిడీ, అరాచక పాలనపై ప్రజలతోపాటు ఆ పార్టీ నాయకులకు విరక్తి పుట్టిందని. ఆయన్నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని అందరూ కంకణం కట్టుకున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 28వ డివిజన్ ద్వారకా నగర్ 1వ రోడ్డు దగ్గర నుండి బుధవారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఏలూరు టిడిపి ఇన్‌ఛార్జ్ బడేటి చంటి పాల్గొన్నారు. ప్రతి చోటా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. ప్రతీ గడపకూ వెళ్ళిన బడేటి చంటి గడచిన నాలుగున్నరేళ్ళలో వైసిపి హయాంలో ప్రజలకు జరిగిన నష్టాలను వివరించారు. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ సీఎం తన మాయ మాటలతో ప్రజలను నమ్మించేందుకు ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంభిస్తే ప్రజలు మాత్రం ఆదుకోండి ఆంధ్రాను అంటూ కోరుతున్నారని బడేటి చంటి పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలు కూడా సైకో జగన్ వైఖరి చూసి ఆభద్రతా భావనలో చిక్కుకున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలన్నీ అందని ద్రాక్షగా మారాయన్నారు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల బదిలీలంటూ జిమ్మిక్కులు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజల్లోకి వచ్చి ముద్దులు పెట్టిన సీఎం ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఆయన మండిపడ్డారు. ఏలూరు నియోజకవర్గం అభివృద్ధిని నాలుగున్నరేళ్ళుగా విస్మరించిన ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఎన్నికలు దగ్గరపడడంతో కమీషన్లు పోతాయన్న భయంతో హడావుడిగా శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజామోదం కోల్పోయిన ఎమ్మెల్యేకు రానున్న ఎన్నికల్లో శృంగభంగం తప్పదని బడేటి చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్ రెడ్డి నాగరాజు, డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్, మాజీ కార్పొరేటర్ సరిది కృష్ణవేణి, మనోహర్,కలవలపూడి చంద్రశేఖర్, వీరభక్తుల రామారావు, మచ్చా ఉమ, ఐకే కృష్ణ, నక్కా అప్పారావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.