ఉద్యోగుల ఆర్థిక బకాయిలకై సమ్మెకు సిద్దం కావాలి
1 min readహెచ్.తిమ్మన్న ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు రావలసిన ఆర్థిక బకాయిల కొరకై సమ్మెకు సిద్ధం కావాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న మరియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోకారి, జనార్దన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు తేదీ 31-12-2023 న స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న మాట్లాడుతూ…గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆర్థిక బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తా ఉందని, చివరకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు చెల్లించకుండా ఉక్కు పాదం మోపిందని త్వరలోనే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.12వ పిఆర్సి బకాయిలు, మూడు విడుతల కరువు బత్యం బకాయిలు, ఆర్జిత సెలవు బకాయిలు, జీవిత బీమా బకాయిలు, భవిష్య నిధి రుణబకాయలు, మొత్తం కలిపి దాదాపు 30 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయని, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు స్పందించడం లేదని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించడం సమాజానికి శ్రేయస్కరం కాదని విమర్శించారు.అశాస్త్రీయ విద్యా విధానంతో 3,4,5 తరగతులను విలీనం చేసి ప్రాథమిక విద్యను బలహీనపరిచిందని ఫలితంగా నాలుగు లక్షల మంది విద్య పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జిపిఎస్ పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని, జిపిఎస్ ను కూడా వ్యతిరేకిస్తున్నామని, కేవలం పాత పెన్షన్ విధానం మాత్రమే ఆమోదయోగ్యమని తెలియజేశారు.ఉద్యోగుల ఉపాధ్యాయుల భవిష్య నిధి డిపాజిట్ సొమ్ములు సైతం సంక్షేమ పథకాలకు మళ్లించి ఇబ్బందులకు గురి చేయడం అత్యంత శోచనీయమని విమర్శించారు.సిపిఎస్ ఉద్యోగులకు ప్రతినెల చెల్లించాల్సిన 10% మ్యాచింగ్ గ్రాంటును గత మార్చి నెల నుంచి చెల్లించడం లేదని పైగా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ నుంచి వచ్చిన 500 కోట్లు దారి మళ్లించి సంక్షేమ పథకాలకు వాడుకోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.గత 20 రోజులుగా రాష్ట్రంలో సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్, అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, త్వరలోనే వారితో కలిసి ఉద్యమించడానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.ఉద్యోగులు ఉపాధ్యాయులు రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది వారి కుటుంబ సభ్యుల ఓట్లు సుమారు 70 లక్షల కోట్లు ఈ ప్రభుత్వానికి అవసరమో లేదో తేల్చుకోవాలని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్, గాన రాష్ట్రాలలో కేవలం ఒకటి, రెండు శాతం ఓట్లతో అధికార ప్రతిపక్షాలు తారుమారు అయ్యాయని, ఈ ప్రభుత్వం ఇలానే కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ప్రచారం చేసి ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వ్యతిరేక విధానాలను తెలియజేస్తామని, ఈ రాష్ట్రంలో ఉద్యోగులు నిరుద్యోగులు ఏకమైతే ప్రభుత్వాన్ని దించి వేయడం పెద్ద సమస్య కాదని వివరించారు. ఈ సమావేశంలో ఎస్టీయూ నాయకులు ఎం శ్రీధర్, కే నారాయణస్వామి, శేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.