PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ హక్కులు సాధించేవరకు పోరాటం ఆగదు

1 min read

– శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాల్సిందే నవంబరు16 ఛలో విజయవాడకు తరలిరండి
పల్లెవెలుగు, వెబ్​ బండిఆత్మకూరు: రాయలసీమ హక్కులు సాధించేవరకు పోరాటం కొనసాగుతుందనీ, ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాల్సిందేనని అక్టోబర్ 1 ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. బండిఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో మంగళవారం ఈ నెల 16 న విజయవాడలో జరిగే రాయలసీమ సత్యాగ్రహ దీక్షకు తరలిరావాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బస్టాండు సెంటర్ లో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి 1953 అక్టోబర్ 1 న తెలుగు రాష్ట్రం ఏర్పడిందని రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆనాడు రాయలసీమ లోనే ఏర్పాటు చేసారని అయితే తెలంగాణా ప్రాంతం 1956 నవంబర్ 1 న ఆంధ్ర రాష్ట్రంలో కలవడంతో ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాదు కు తరలించి ఆనాడే రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం విడిపోవడంతో 1953 అక్టోబర్ 1 న ఏర్పడిన ఆంధ రాష్ట్రమే నేడు ఆంధ్రప్రదేశ్ గా కొనసాగుతోందని రాష్ట్ర అవతరణ వేడుకలు నవంబరు 1 న నిర్వహిస్తూ శ్రీ బాగ్ ఒడంబడికను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారనీ, రాయలసీమ హక్కుల పత్రం అమలుకాకుండా చేయడమేనన్నారు. చేరిన నవంబరు 1 న విడిపోయిన జూన్ 2 న ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ అక్టోబర్ 1 ని విస్మరించడం బాధిస్తోందని రాయలసీమ ప్రజానీకం ప్రభుత్వ ద్వంద్వ విధానాలను గమనించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసి అక్కడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అంటూ రాయలసీమ పట్ల వివక్ష చూపి యువత భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలిగించిందని ఆయన గుర్తు చేసారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అసెంబ్లీ వేదికగా శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమ హక్కుల పత్రాన్ని అమలు చేస్తామని ప్రకటించి కర్నూలుకు న్యాయ రాజధాని అంటూ ఏర్పాటుకు కార్యాచరణ చేపట్డకుండా మభ్యపెడుతోందని విమర్శించారు. శ్రీబాగ్ ఒప్పందంలో కీలకమైన కృష్ణా జలాలు రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత ఉన్నా వాటిని పట్టించుకోకుండా కరువుకు కారణమవుతున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీల పెద్దల పోకడలను రాయలసీమ ప్రజానీకం గమనిస్తున్నారనీ తగిన సమయంలో బుద్ది చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు జాతీయ స్థాయి వైద్య విద్యాలయం, వ్యవసాయ విశ్వ విద్యాలయం, బుందేల్ ఖండ్ తరహా ముప్పైవేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ, గుంతకల్లు రైల్వే జోన్ , కడప ఉక్కు కర్మాగారం పట్ల సమైక్యవాదులు ఎందుకు నోరు మెదపడం లేదని దశరథరామిరెడ్డి నిలదీశారు. పాలక పక్షం , ప్రతిపక్ష పార్టీలు అమరావతి, పోలవరం, విశాఖ రాజధాని, రైల్వే జోన్ కోసం పై ఉన్న శ్రద్ద కరువు విలయతాండవం చేసే రాయలసీమ పట్ల చూపకపోవడం వీరి ద్వంద్వ నీతిను తెలియచేస్తుందనీ, వీరి మోసపూరిత ప్రకటనలకు రాయలసీమ ప్రజానీకం అడ్డుకట్ట వేసి రాయలసీమ హక్కులను సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మరోసారి రాయలసీమ ప్రజలు మోసపోవడానికి సిద్దంగా లేరని, రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి కరువును తరిమికొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక దినోత్సవం నవంబరు 16 న విజయవాడ ధర్నా చౌక్ లో వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టమని డిమాండ్ చేస్తూ వాటి అమలుకై పాలకులను నిలదీద్దామని దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ ఎనిమిది జిల్లాలలో శ్రీబాగ్ ఒడంబడిక అమలు కోసం ఉద్యమం ఉదృతం చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కర్నూలులో హైకోర్టు, విభజన చట్టంలో సాధించుకున్న తెలుగుగంగ, హంద్రీ నీవా , గాలేరునగరి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి చేసి నీటికేటాయింపులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, సంతజూటూరు నాయకులు M.క్రిష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, మునాఫ్, నాగ సుధాకర్, సుబ్బరాయుడు, భూమా రవీంద్ర రెడ్డి, పక్కీర్ రెడ్డి, డి.క్రిష్ణారెడ్డి తదితరులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

About Author