డప్పు కళాకారుల పెన్షన్ దరఖాస్తు పై ఉన్నతాధికారులు స్పందించాలి
1 min readఏపిడికెయస్ రాష్ట్ర అధ్యక్షులు యం డి ఆనంద్ బాబు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : డప్పు కళాకారులు, చర్మకారుల ఆన్లైన్ పెన్షన్ దరఖాస్తు కు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం డి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు నగరం బుధవార పేట లోని కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్ అధ్యక్షతన డప్పు కళాకారుల సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి సందె పోగు సత్యం మాట్లాడారు. మూడు సంవత్సరాలుగా డప్పు కళాకారులకు, చర్మకారుల కు పెన్షన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ, ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు సందర్భంగా సచివాలయ అధికారులు అవగాహన లేమితో ఒక్కోసారి ఒక్కో పేరుతో అక్షర జ్ఞానం లేని నిరుపేదలైన దళితుల మనోభావాలతో ఆడుకుంటూ అవమానాలకు గురి చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ మరియు పెన్షన్లను చూస్తున్న జాయింట్ కలెక్టర్ లు వెంటనే స్పందించి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారానే పెన్షన్ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయించుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోటి చక్రపాణి, గోనెగండ్ల మా రేసు, సహాయ కార్యదర్శులు పసుపల వెంకటేశ్వర్లు, ఐరన్ బండ దేవదాసు, హరిజన రాజు, కెవిపిఎస్ జిల్లా నాయకులు డి విజయమ్మ పాల్గొన్నారు.