ఢిల్లీలో లాక్‌డౌన్ అమలుకు సిద్ధమే: ఆప్ సర్కార్
1 min read
పల్లెవెలుగువెబ్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైతే సంపూర్ణ లాక్‌డౌన్ విధించడానికి సిద్ధమని కేజ్రీవాల్ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. వ్యవసాయ వ్యర్థాల దహనంతో కేవలం 10శాతం కాలుష్యం మాత్రమే వస్తుందని కోర్టుకు తెలిపారు కేంద్రం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఢిల్లీ పరిసరాల్లోని కంకర క్రషర్ మిషన్లు, విద్యుత్ కేంద్రాలను మూసివేస్తే కొంత మేర కాలుష్యం తగ్గుతుందని ఆయన కోర్టుకు వివరించారు.
మరోపక్క కోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రంలో ఢిల్లీ సర్కార్ పలు కీలక అంశాలను లేవనెత్తింది. ఢిల్లీతో పాటు క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో కూడా లాక్‌డౌన్ విధిస్తేనే సత్వర ఉపశమనం కలుగుతుందని పేర్కొంది. లాక్‌డౌన్ అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. పక్కరాష్ట్రాల పరిధిలోని ఎన్‌సీఆర్ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకునేలా కేంద్రం గానీ, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌గానీ ఆదేశించాలి అని ప్రమాణపత్రంలో కేజ్రీవాల్ సర్కార్ పేర్కొంది.
ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యాన, యూపీ రాష్ట్రాలకు చెందిన సీఎస్‌లతో రేపు కేంద్రం సమావేశమై కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తూ.. విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. కాగా, ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి ఢిల్లీ వ్యాప్తంగా అన్ని బడులను తాత్కాలికంగా ముసివేసి.. ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేలా చర్యలు చేపట్టింది.