భారీగా పడిపోయిన రూపాయి విలువ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత కరెన్సీ విలువ సోమవారం భారీగా పతనమైంది. ఎన్నడూలేనంత రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 54 పైసల మేర బలహీనపడి 77.44కు చేరుకుంది. ఒకదశలో రూపాయి 62 పైసలు పతనం కావడంతో ఎక్స్చేంజ్ రేటు రూ.77.52కు ఎగబాకింది. గత శుక్రవారం కూడా రూపాయి విలువ 55 పైసలు క్షీణించింది. వరుసగా రెండు సెషన్లలో 109 పైసల పతనాన్ని చవిచూసింది. అంతర్జాతీయంగా డాలర్ బలం పుంజుకోవడంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు పెద్దఎత్తున వెనక్కి వెళ్తుండటం రూపాయికి భారీగా గండికొట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయిలో కదలాడుతుండటమూ మన కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది.