రాష్ట్రంలో అంగన్వాడీలపై పులివెందుల దౌర్జన్యం
1 min readఅంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి తెరవడం దారుణం.
మహిళల జోలికి వస్తె వైసీపీ పతనం తప్పదు..
మరొక్కసారి జగన్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల వేతనం రూ.5వేలు.
అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలపై పులివెందుల రౌడీ రాజకీయ దౌర్జన్యం వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నందికొట్కూరు పట్టణంలో ధర్నా చౌకులో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు శనివారం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు పిల్లల దేవాలయాలు అన్నారు. అంగన్వాడీల పట్ల చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్ల నుంచి ఒక్క సమస్య పరిష్కరించకపోగా ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని విమర్శించారు. జగన్ బూటకపు హామీలు ఇచ్చి అంగన్వాడీల ఓట్లతో అధికార పీఠం ఎక్కి మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయల జీతం చెల్లిస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తీరా గెలిచాక మోసం చేశారని ధ్వజమెత్తారు. అంగన్వాడీ కార్మికులు పని ఒత్తిడితో మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో గొడ్డు చాకిరి చేస్తున్న అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని రోడ్డెక్కారన్న విషయం ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని అన్నారు. తెలంగాణ కన్నా జీతం పెంచి ఇస్తామన్న జగనన్న హామీని అమలు చేయకుండా దగా చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఈ ప్రభుత్వం దుర్మార్గమైన పద్ధతులను అవలంబిస్తోందని అన్నారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. వైసీపీ నాయకులు అంటున్నట్లు అంగన్వాడీలు ఒళ్ళు బలిసి బయటకు రాలేదని, కడుపు కాలి బయటకు వచ్చారన్న విషయం విస్మరించిన ఈ ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల తాళాలు పగులగొట్టి సరుకులను దొంగతనంగా సచివాలయాలకు తరలించడం హేయమైన అని విమర్శించారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.