PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళకు రెండోసారి గుండెలో రెండు వాల్వుల మార్పిడి

1 min read

– ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో అత్యంత అరుదైన శ‌స్త్ర చికిత్స‌

– విజ‌య‌వంతంగా చేసిన డాక్ట‌ర్ సుధీర్ బృందం

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్​: గ‌తంలో ఒక‌సారి గుండెలో రెండు వాల్వుల మార్పిడి శ‌స్త్రచికిత్స జ‌రిగిన రోగికి.. ఆ రెండూ విఫ‌లం (స్ట్రక్చరల్ వాల్వ్ డిటీరియరేషన్ -ఎస్‌వీడీ) కావ‌డంతో మ‌రోసారి శ‌స్త్రచికిత్స చేసి ఆ రెండింటినీ మార్చిన అరుదైన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రులలో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో జ‌రిగింది.  ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్సల్టెంట్ కార్డియోథొరాసిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ జి.సుధీర్ తెలిపారు.  ‘‘వ‌రంగ‌ల్ ప్రాంతానికి చెందిన మంజుల అనే 42 ఏళ్ల మ‌హిళ‌కు సుమారు ద‌శాబ్దం క్రితం మైట్ర‌ల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ రెండింటినీ మార్చాల్సి వ‌చ్చింది. అప్ప‌ట్లో ఆమెకు జంతువుల గుండె నుంచి తీసిన బ‌యోప్రోస్థ‌టిక్ వాల్వుల‌ను అమ‌ర్చారు. అప్ప‌ట్లో వీటి జీవిత‌కాలం 10 నుంచి 15 ఏళ్లు మాత్ర‌మే ఉండేది. ఈ మ‌హిళ‌లో ప‌దేళ్ల‌కే ఆ రెండూ పాడ‌య్యాయి. ఈ కార‌ణంగా ఆమెకు ఆయాసం, గుండెదడ ఎక్కువగా వచ్చాయి. కాళ్ల వాపులు, ముఖం వాయడం, ఇతర సమస్యలూ ఉన్నాయి. ఈ ల‌క్ష‌ణాల‌తో ఆమె 6 నెలలుగా బాధపడుతున్నారు. దాంతో ఆమెకు గ‌తంలో అమ‌ర్చిన వాల్వుల‌ను రెండింటినీ మార్చాల్సి వ‌చ్చింది. మొద‌టిసారి వాల్వులు వేసేట‌ప్పుడు పెద్ద‌గా ఇబ్బంది ఏమీ ఉండ‌దు. కానీ వాటిని మార్చడం అనేది చాలా సంక్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. ఒక్కో వాల్వుకు సుమారు 12 నుంచి 15 కుట్లు వేయాల్సి ఉంటుంది. అంటే రెండింటికీ క‌లిపి 30కి పైగా కుట్లు లోప‌ల ఉంటాయి. వాట‌న్నింటినీ క‌త్తిరించి, పాడైన వాల్వుల‌ను తీసి, మ‌ళ్లీ కొత్త వాల్వులు పెట్టాలి. అలా పెట్టేట‌ప్పుడు అక్క‌డే మ‌ళ్లీ కుట్లు వేయాలి. తీసే క్ర‌మంలో కుట్ల‌లో ఏ చిన్న న‌ల‌క అయినా లోప‌ల ఉండిపోతే, అది ర‌క్తం ద్వారా మెద‌డులోకి వెళ్లి, ప‌క్ష‌వాతం సంభ‌వించే ప్ర‌మాదం ఉంటుంది. ర‌క్తంద్వారా మ‌రే ఇత‌ర అవ‌య‌వ‌యంలోకి అయినా వెళ్ల‌చ్చు. మ‌రికొన్ని సంద‌ర్భాల‌లో రోగులు ఆప‌రేష‌న్ టేబుల్ మీదే మ‌ర‌ణిస్తారు కూడా. ఇంత ప్ర‌మాదం ఉండ‌టంతో న‌గ‌రంలోని కొన్ని ఆస్ప‌త్రుల వారు ఈ కేసును తీసుకోవ‌డానికి నిరాక‌రించారు. దాంతో ఆమె ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రికి రాగా… ఇక్క‌డ అన్నిర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేసి, దాదాపు 10 గంట‌ల‌కు పైగా శ‌స్త్రచికిత్స చేసి, ఆమెకు సుర‌క్షితంగా మెకానిక‌ల్ వాల్వుల‌ను అమ‌ర్చాం. ఈ శ‌స్త్రచికిత్స‌లో కార్డియో థొరాసిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ సుధీర్‌, కార్డియాక్ అనెస్థ‌టిస్టు డాక్ట‌ర్ మాన‌స,  కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ భాను, ఇంటెన్సివిస్టు డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌, త‌దిత‌రులు కూడా పాల్గొన్నారు. బ‌యోప్రోస్థ‌టిక్ – మెకానిక‌ల్ వాల్వుల మ‌ధ్య తేడాబ‌యోప్రోస్థ‌టిక్ వాల్వులు గ‌రిష్ఠంగా 15-25 ఏళ్లు మాత్ర‌మే ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల సాధార‌ణంగా 60 ఏళ్ల వ‌య‌సు దాటిన‌వారికి వాల్వులు మార్చాల్సి వ‌స్తే ఇవి వేయాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాల‌లో సూచిస్తారు. ఇవి అమ‌ర్చుకుంటే ర‌క్తం ప‌ల్చ‌బ‌రిచే మందులు వాడ‌క్క‌ర్లేదు. మెకానిక‌ల్ వాల్వులు అమ‌ర్చిన‌ప్పుడు ర‌క్తం ప‌ల్చ‌గా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. అవి వాడుతుంటే ఎన్నాళ్ల‌యినా అవి నిక్షేపంగా ప‌నిచేస్తాయి. అయితే భ‌విష్య‌త్తులో గ‌ర్భం రావాల‌నుకునేవారికి మాత్రం ఈ వాల్వులు పెట్ట‌రు. వాళ్లు ర‌క్తం ప‌ల్చ‌బ‌డే మందులు వాడితే పుట్ట‌బోయే బిడ్డ‌కు అవ‌య‌వ‌లోపాలు వ‌స్తాయి. అలాగే బ్రెయిన్ హెమ‌రేజ్ లాంటి ప‌రిస్థితులు ఉన్న‌వారికీ ర‌క్తం ప‌ల్చ‌బ‌డే మందులు వాడ‌కూడ‌దు కాబ‌ట్టి వారికీ బ‌యోప్రోస్థ‌టిక్ వాల్వులే అమ‌ర్చాలి. అయితే, ఈ త‌ర‌హా వాల్వులు అమ‌ర్చేట‌ప్పుడు… ఎప్ప‌టిక‌ప్పుడు పరీక్ష‌లు చేయించుకుంటూ వాటి ప‌నితీరు గ‌మనించుకోవాల్సిందిగా ముందుగానే రోగికి చెప్పాలి’’ అని డాక్ట‌ర్ సుధీర్ వివ‌రించారు.

About Author