ఆయాల జీతాలను రెగ్యులర్ గా అందజేయాలి.. పని భారం తగ్గించాలి
1 min read
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు (TMF), కార్మికుల యూనియన్ ఎమ్మెల్యేకి సమర్పిస్తున్న వినతి
పల్లెవెలుగు, కర్నూలు: కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వేలాదిమంది ఆయాలుగా పని చేస్తున్నారు. ఎంతో పేదవారైన వీరికి ఇచ్చే 6 వేలు (ఆయాలకు) ప్రతి నెల ఇవ్వక పోవడం వలన ఎన్నో కష్టాలకు గురవుతున్నారు. ఆయాలు పాఠశాలల్లోని గదులను, లెట్రిన్ లను, రోజుకు మూడు సార్లు శుభ్రం చేస్తున్నారు. అలాగే పరిసరాలను కూడా శుభ్రం చేస్తున్నారు.అయితే వీరికి లభిస్తున్న వేతనం నెలకు కేవలం 6వేల రూపాయలు మాత్రమే. ఇక వేసవి సెలవుల్లో అయితే సగం వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఆ నామమాత్రమైన వేతనం కూడా రెగ్యులర్ గా అందడం లేదు. రోజుకు రెండు వందల వేతనంతో వీరు కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా ఉంది. పాఠశాలలోని పిల్లల సంఖ్యను బట్టి స్వీపర్స్, ఆయాల సంఖ్యను నిర్ణయించడం వలన, కొన్ని పెద్ద పాఠశాలల్లో చాలా పనిభారం వీరి మీద ఎక్కువగా ఉంటోంది. అలాగే వీరు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య చికిత్సకై, ఎలాంటి ఆరోగ్య పథకంగాని, ఈఎస్ఐ సౌకర్యం గాని లేకపోవడం వలన అప్పులు చేయవలసి వస్తోంది. వీరు పని చేస్తున్న కాలంలో ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. అలాగే పని నుండి విరమణ పొందిన తరువాత ఎలాంటి పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ లాంటివి ఏవీ లేక వట్టి చేతులతో దిగిపోయి, దుర్భర జీవితాన్ని గడపవలసి వస్తోంది. సమాజంలో అట్టడుగున జీవిస్తున్న ఈ కార్మికుల దయనీయ పరిస్థితులను దృష్టిలోకి తీసుకొని మా సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
మా కోర్కెలు:1.స్కూల్ ఆయాల జీతాలను రెగ్యులర్ గా అందజేయాలి మరియు పని భారం తగ్గించాలి.
2. ఇ.ఎస్.ఐ., పి.ఎఫ్. వర్తింప చేయాలి. 3. 15 వేలకు జీతాన్ని పెంచాలి.