నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. నిందితులు అరెస్ట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : నెల్లూరు కోర్టులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసు పత్రాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ విజయా రావు ఆదివారం మీడియాకు వివరించారు. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌కు చెందిన సయ్యద్ హయత్, పొర్లుకట్టకు చెందిన ఖాజా రసూల్ ఈ చోరీలకు పాల్పడ్డారు. నిందితులు కోర్టు ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న ప్రదేశం నుంచి ఇనుప సామగ్రి చోరీ చేసేందుకు వెళ్లారు. అయితే, అదే సమయంలో కుక్కలు వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునేందుకు కోర్టు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వారికి బీరువా కనిపించడంతో, దానిలోని బ్యాగ్‌ను దొంగిలించారు. బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్‌లోని ల్యాప్‌టాప్, ఇతర వస్తువులు తీసుకుని అందులో ఉన్న పత్రాలను పడేసి, అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ చోరీ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని పోలీసులు తెలిపారు. బెంచ్ క్లర్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, సీసీ టీవీ ఫుటేజీతోపాటు పూర్తి ఆధారాలతో కేసును చేధించామని ఎస్పీ వివరించారు. నిందితులపై గతంలో 14 కేసులున్నాయని, ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిందితుల్ని పట్టుకున్నామని చెప్పారు. నిందితుల దగ్గరి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, 7 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.