‘హార్ట్’పై… అవగాహన ఉండాలి: డా.పి.. చంద్రశేఖర్
1 min read- 29న ప్రపంచ హృదయ దినోత్సవం
కర్నూలు: హృదయ స్పందనపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి, కార్డియాలజిస్ట్ డాక్టర్ పి. చంద్రశేఖర్. ప్రస్తుత సమాజంలో యువత చెడు అలవాట్లకు బానిసై… ఆరోగ్యంపై దృష్టి సారించడంలేదని, అందుకే గుండె నొప్పితో బాధపడుతూ మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నగరంలోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఛాంబరు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ నెల 29న (శుక్రవారం ) ‘ ప్రపంచ హృదయ దినోత్సవం’ సందర్భంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏపీ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా– ఏపీ చాప్టర్ మరియు హార్ట్ ఫౌండేషన్ సంయుక్తంగా వరల్డ్ హార్ట్ డే వేడుకలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డా. జార్జ్జోసెఫ్ ముఖ్య అతిథిగా విచ్చేసి గుండె స్పందనపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్ తెలిపారు. సమావేశంలో హార్ట్ ఫౌండేషన్ సభ్యులు చంద్రశేఖర్ కల్కూర, తదితరులు పాల్గొన్నారు.