వేసవిలో మంచినీటి సమస్య కనిపించకూడదు..
1 min read
వేసవి పూర్తయ్యే వరకు జిల్లాల్లో కాల్ సెంటర్లు పెట్టుకోండి
తగిన ఏర్పాట్లు చేసుకోండి
నీళ్ల సమస్యలపై జీపీఎస్ – రియల్ టైమ్ పర్యవేక్షణ చేయండి
జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం
అమరావతి, న్యూస్ నేడు: వేసవిలో ఎక్కడా కూడా మంచినీటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ఎక్కడైనా సరే మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం వేసవి కాలం పూర్తయ్యేవరకు జిల్లాలో తాత్కాలిక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంచినీళ్ల సమస్య ఎక్కడైనా తలెత్తినా దాన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షించి పరిష్కరించాలన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను అన్నిటిని నీటితో భర్తీ చేసుకోవాలన్నారు. ప్రజలకు మంచినీరు అందించే ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడా కూడా నిధులకు కొరత లేదని, జిల్లా కలెక్టర్లు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వేసవి నీటి ఎద్దడి ఎదుర్కోవడంలో హేతుబద్దంగా పనిచేయాలని, అప్పుడే ప్రజలు మన పనులను హర్షిస్తారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా తనకు మంచినీటి సమస్య కనిపించకూడదని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.