ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉండవు
1 min read– పౌర సరఫరాల సంస్ధ విసి,యండి జి. వీరపాండ్యన్
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ధాన్యం కొనుగోలులో రైతులకు ఏవిధమైన నష్టం జరుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల విసి మరియు యండి జి. వీరపాండ్యన్ చెప్పారు. బుధవారం ఉంగుటూరు మండలంలో చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరులో రైతు భరోసా కేంద్రాలను, ధాన్యం కల్లాలను ఆయన పరిశీలించారు. తొలుత చేబ్రోలు, నారాయణపురంలో రైతులు అరబెట్టిన ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా క్షేత్రస్ధాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు ఆర్బికేలో గోనె సంచులు సరిపడా అందుబాటులో ఉంచే విషయం, తేమ శాతం కొలిచే యంత్రాలు సిద్దంగా ఉన్నదీ లేనిదీ వాటి పనితీరును పరిశీలించారు. అదే విధంగా టెక్నికల్ అసిస్టెంట్ల నియామకం జరిగిందీ లేనిది ఆయన వాకాబు చేశారు. పండిన ప్రతి ధాన్యం గింజకు ధర అందించే లక్ష్యంతో ఈసారి ప్రభుత్వం నూతన విధానం అమలు చేస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టనుందని అన్నారు. ధాన్యం తోలిన 21 రోజుల్లో రవాణా, హమాలి కూలీల ఖర్చులు కలిపి సంబంధిత రైతు ఖాతాకు జమచేయనున్నామని అన్నారు. నారాయణపురంలో పలువురు రైతులు మాట్లాడుతూ పంట కోసి ధాన్యం ఆరబెడుతున్నామని ఈ దృష్ట్యా ధాన్యం సేకరణ వెంటనే ప్రారంభించాలని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ధాన్యం శాంపిల్స్ సేకరణ ఉదయం 11 దాటాక తీయాలని రైతులు సూచించారు. అనంతరం ఉంగుటూరు రైతుభరోసా రైతులతో ఆయన నమావేశం నిర్వహించారు.. ట్రక్ షీట్, ధాన్యం తోలాక ఏ రైస్ మిల్లుకు చేరాలో అంతా కంప్యూటర్ ఆధారంగా జరుగుతాయన్నారు. సంచులు, రవాణా ట్రాన్స్ పోర్ట్, హమాలీ ఖర్చులు రైతులే పెట్టుకుంటే అవిషయాన్ని ముందుగా కచ్చితమైన వివరాలతో ఆర్టికెల్లో నమోదు చేయించాలని అలా ఐతేనేవాటి తాలూకు డబ్బులు పడతాయని ఈవిషయం లో రైతులు అధికారుల సూచనలు పాటించి నూతన విధానానికి రైతులు సహకరించాలని వీరపాండ్యన్ విజ్ఞప్తి చేసారు. గోనెసంచి కి రూ. 3.70, వంద కేజీల బస్తాకు హమాలీ ఛార్జీ రూ.100 చెల్లించనున్నామని ఆయన రైతులకు వివరించారు. జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, జిల్లా సహకారశాఖ అధికారిణి ప్రవీణ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజుభార్గవి, జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్.ఎస్. రాజు, భీమడోలు ఏడీఏ పి.ఉషారాజకుమా , జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు, నారాయణపురం సొసైటీ చైర్ పర్సన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాపారావు, బాబ్జీ, తహశీల్దారు ఏవీ రమణారావు, ఎంపీడీవో ప్రేమాన్విత పాల్గొన్నారు.