బిచ్చగాళ్లలా చూస్తున్నారు.. పాక్ ప్రధాని ఆవేదన
1 min readపల్లెవెలుగువెబ్ : తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కంటే చిన్న దేశాలు ఆర్థికంగా తమను దాటిపోతే తాము మాత్రం 75 ఏళ్లుగా చిప్పపట్టుకుని అడుక్కుంటున్నామని అన్నారు. మిత్ర దేశాల్లో పర్యటిస్తే కూడా డబ్బుల కోసమే వచ్చారని అనుకుంటున్నారని, వారికి ఫోన్ చేసినా అలానే భావిస్తున్నారని అన్నారు. న్యాయశాస్త్ర విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పాకి స్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని, దేశం ఇప్పుడు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. తాను ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికే దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న ప్రధాని.. ఇటీవల సంభవించిన వరదలతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. వరదల్లో దేశవ్యాప్తంగా 1400 మంది చనిపోయారని, దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు దీని ప్రభావానికి గురయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా రూ.95 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.