పత్తికొండలో మళ్లీ దొంగలు పడ్డారు ..
1 min readమూడు నెలల్లో 30 చోట్ల దొంగతనాలు
పోలీసులకు సవాలుగా నిలుస్తున్న దొంగతనాలు బెంబేలెత్తిపోతున్న పట్టణవాసులు
దొంగతనాల నివారణపై పోలీసుల చర్యలు శూన్యం
దొంగలు పట్టుబడినా రికవరీ కాని సొమ్ము
పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగినా కనికరించని పోలీసులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలో మళ్లీ దొంగలు పడి దొరికిందంతా దోచుకెళ్లారు. పత్తికొండ పట్టణంలో గత మూడు నెలలుగా దొంగలు రెచ్చిపోతున్నారు. మూడు నెలల నుండి పట్టణంలో 30 చోట్ల దొంగతనాలు జరిగాయి. పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ఇటు పోలీసులను అటు పట్టణవాసులను కలవరపెడుతున్నాయి. వరుసగా జరుగుతున్న దొంగతనాలు పట్టణవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకే రోజు పట్టణంలో 8 చోట్ల దొంగతనాలు జరిగాయి. అలాగే వారం విడిచి మరోసారి ఆరు చోట్ల దొంగలు పడి దోచుకెళ్ళారు. ఇలా మూడు నెలల్లో దాదాపు 8సార్లు 30 చోట్ల దొంగతనాలు జరిగాయి. వరుసగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు సవాలుగా నిలుస్తున్నాయి. గత 15 రోజుల క్రితం పట్టణంలోని పెట్రోల్ బంకు వెనుక ఉన్న ఇంటిలోకి దూరి 12 తులాల బంగారు, 60 వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. దొంగలు పట్టుబడిన వారి నుండి దొంగతనం సొమ్మును రికవరీ చేయలేకపోతున్నారని పోలీసులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే శుక్రవారం రాత్రి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఉన్న ఆరు షాపుల సెట్టర్లను తెరిచి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పత్తికొండ పట్టణంలో జరిగిన దొంగతనాల బాధితులు రోజురోజుకు పెరిగి పోతున్నారు. రికవరీ సొమ్ము కోసం కాళ్లు అరిగేలా బాధితులు పోలీసుల చుట్టు తిరుగుతున్నారు.