ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్..
1 min read– తీవ్రంగా నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారడీగా ఉందని ఇది పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని అన్ని వర్గాల ప్రజలను నిరోత్సాహపరిచిందని, ముఖ్యంగా విద్యా, వైద్యం, వ్యవసాయ,కార్మిక రంగాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలం చెందిందని, కార్పొరేట్ లకు అనుకూలంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందని సిపిఐ జిల్లా నాయకులు వి.రఘురామమూర్తి, ఎం.రమేష్ బాబులు విమర్శించారు.గురువారం స్థానిక జై కిసాన్ పార్కులో సిపిఐ ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సంపన్న వర్గాలకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి ఉపయోగము లేదని తీవ్ర నిరాశగా మిగిలిచ్చిందని విమర్శించారు.రాష్ట్రంలోని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపులు లేకపోవడం, ప్రత్యేక హోదా ఊసే లేకపోవడం, వ్యవసాయ రంగానికి,యూరియా, రసాయన ఎరువులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలను ఈ బడ్జెట్ లో తగ్గించడం వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోనికి నెట్టి వేస్తుందని అన్నారు.నంద్యాల కర్నూలు జిల్లా ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని కేవలం అంకెల గారడిగా ఉన్నదని, సంపన్న వర్గాలకు మరింత సంపదను చేకూర్చేందుకే ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ పేదలను మరింత పేదలుగా ధనికులను మరింత ధనవంతుడుగా చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వచ్చే ఎన్నికల్లో కార్పొరేట్ శక్తుల ద్వారా లబ్ధి పొందాలని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని వారు విమర్శించారు. సిపిఐ నాయకులు శ్రీనివాసులు, మౌలాలి, దినేష్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ, జై కిసాన్, కార్పొరేషన్, నిరాశ, సబ్సిడీ