ఈ బలగం మనందరిదీ….
1 min read– రెస్టారెంటు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి
– ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచు మనోజ్, గబ్బర్‌సింగ్ గ్యాంగ్
– నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్స్‌లో సరికొత్త ఫ్యామిలీ రెస్టారెంట్
పల్లెవెలుగు వెబ్ హైదారబాద్ : బలగం సినిమాతో మనందరం కుటుంబ విలువల గురించి తెలుసుకున్నామని, అలాగే ఈ రెస్టారెంటుకు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి అన్నిరకాల రుచులనూ ఆస్వాదించవచ్చని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్స్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన బలగం ఫ్యామిలీ రెస్టారెంటును ఆయన ప్రారంభించారు. ఒకేసారి 64 మంది కూర్చుని తినగల ఈ రెస్టారెంటులో అన్నిరకాల బిర్యానీలు, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బ్రెడ్స్, గ్రిల్స్, తందూరీ్.. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, “నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఎక్కడా లేని మంచి రెస్టారెంటు తెరిచారు. ఇది చాలా బాగుంది. ఈ బలగం టీమ్ కేవలం జంట నగరాల్లోనే కాక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా మరిన్ని రెస్టారెంట్లు తెరిచి, మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. వ్యక్తిగతంగా నేను నాన్ వెజ్ కూడా తింటాను గానీ, నాకు వెజిటేరియన్ భోజనం అంటేనే చాలా ఇష్టం. ముఖ్యంగా సాంబారు, అన్నం, నెయ్యి.. ఇవి ఉంటే ఇంకేమీ అక్కర్లేదు” అన్నారు. నేరేడ్‌మెట్ వాసులు ఇంతకుముందు ఫైన్ డైన్ రెస్టారెంటుకు కుటుంబంతో వెళ్లాలంటే కనీసం రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేదని, ఆ లోటును తీరుస్తూ అందరికీ అందుబాటులో ఇంత మంచి రెస్టారెంటును ప్రారంభిస్తున్నందుకు దీని యజమానులను అభినందిస్తున్నానని ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ అన్నారు. “ఒక కుటుంబంలోని సభ్యులంతా కలిసి పెట్టిన ఈ రెస్టారెంటు చాలా బాగుంది. ఈ ప్రాంతంలోని కుటుంబాల వాళ్లంతా వచ్చి ఎంచక్కా కావల్సిన వెరైటీలు అన్నీ ఇక్కడ తినొచ్చు. యాంబియెన్స్ కూడా చాలా బాగుంది. మన ఆరోగ్యంలో 80 శాతం ఆహారమే నిర్ణయిస్తుంది. మిగిలిన 20 శాతమే మనం వర్కవుట్లు చేసినా, ఇంకేం చేసినా. అందువల్ల మనకు ఏం కావాలి, మన నోట్లోకి ఏం వెళ్తుందన్నదాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా తినాలి. నాకు ఒంట్లో బాగుంటే నాన్‌వెజ్ తింటాను, ఏమాత్రం కాస్త బాగోకపోయినా వెజిటేరియన్ మాత్రమే తింటాను” అని ఆయన చెప్పారు. రెస్టారెంటు ప్రారంభోత్సవంలో గబ్బర్‌సింగ్ గ్యాంగ్ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సందడి చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంటు యజమాని బొల్లా హరిత మాట్లాడుతూ, నేరేడ్‌మెట్ ప్రాంత వాసులు మంచి ఫ్యామిలీ ఫైన్ డైన్ రెస్టారెంటు కావాలంటే ఇటు సైనిక్‌పురి లేదా ఏఎస్ రావు నగర్ వరకు వెళ్లాలని, లేదా నాలుగు కిలోమీటర్లు వెళ్తే తిరుమలగిరి వరకు వెళ్లాల్సి వస్తుందని, అందువల్ల ఈ ప్రాంతవాసుల అవసరాలను తీర్చాలన్న ఉద్దేశంతో, వారికి మంచి ఆహారం అందిచాలన్న లక్ష్యంతో ఈ రెస్టారెంటు ప్రారంభించామన్నారు.