అర్హులందరికీ టిడ్కో గృహాలు అందిస్తా..
1 min readహైకోర్టు బెంచ్ కర్నూలుకు తీసుకొస్తాం
- టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టి.జి. భరత్
- 52వ వార్డులో విజయవంతంగా టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం..
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు నియోజకవర్గంలో అర్హులందరికీ టిడ్కో ఇళ్లు, ఇళ్ల పట్టాలు అందజేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 52వ వార్డు పరిధిలోని సాయిబాబా సంజీవ నగర్, ఎల్‌బీఎస్ నగర్‌లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం ఆయన చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, డ్రైనేజీ, విద్యుత్ వైర్ల సమస్యలను టీజీ భరత్‌తో మొరపెట్టుకున్నారు. భరత్ వారితో మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం రాగానే నిర్మాణ దశలో ఆగిపోయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామన్నారు. ముస్లిం సోదర సోదరీమణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉంటే రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని రంజాన్ తోఫాను అందజేసేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నింటిని మళ్లీ అమలు చేస్తామన్నారు. అనంతరం అడ్వకేట్స్‌తో మాట్లాడుతూ.. తాను గెలిచి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా తీసుకువస్తానని చెప్పారు. న్యాయవాదులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ప్రజలందరూ తనపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇంఛార్జీ బొల్లెద్దుల రామకృష్ణ, నాగన్న, వేణుగోపాల్, కేవీ శ్రీనివాసులు, వి.శ్రీనివాసులు, రంగస్వామి, హనుమంత రెడ్డి, అంజి, చాంద్, శాంతప్ప, సిద్ధయ్య, సర్దార్, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, అనిత, బూత్ ఇంఛార్జీలు పాల్గొన్నారు.