తిరుమలపై స్మశాన వాటికను తొలగించండి
1 min read
వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం…కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల కొండపై స్మశానం ఉందన్న విషయం పై సీఎం చంద్ర బాబు నాయుడు, టీటీడీ చైర్మన్ రామా నాయుడు విచారణ చేసి… హిందూ సమాజానికి నిజాలు వెల్లడించాలని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కే.సీ.కెనాల వద్ద గల వరసిద్ధి వినాయక సభా మందిరం, వినాయక ఘాట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచోటి జిల్లా కేంద్రంలో మార్చి 4న శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో జరిగిన అల్లర్లు, అంతకు ముందు అయ్యప్ప స్వామి శోభాయాత్రలో రాళ్లు రువ్వి.. అల్లర్లు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా… హిందువులపై అక్రమ కేసులు బనాయించారని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆరోపించారు. ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించిన అన్నయ్య జిల్లా పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకట్రామయ్య,కార్యదర్శి పర్రె కోటేశ్వరరావు, మీడియా కన్వీనర్ మాళిగి భాను ప్రకాష్, కర్నూలు జిల్లా అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి గార్లు పాల్గొన్నారు.