‘ ప్రాజెక్టు’లపై నోరు విప్పరెందుకు..!
1 min read– టీడీపీ నాయకులను ప్రశ్నించిన ఎమ్మెల్యే తోగురు ఆర్థర్
– పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నుంచి నీటి విడుదల
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ సూచించారు. ఆదివారం నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవా కాలువకు రెండు పంపుల ద్వారా 675.20 క్యూసెక్కుల నీటిని, పోతిరెడ్డిపాడు హేడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ కాలువకు 4 వేల క్యూసెక్కుల నీటిని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తో కలిసి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టు ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి దోహదపడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుపై తెలుగుదేశం నాయకులు మద్దతివ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. జూమ్ మీటింగ్‌లకు పరిమితమైన తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాయలసీమ వివక్షకులు టిడిపి నేతలే’ అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నీటి వాట తీసుకుంటున్నామని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ లో నీటిమట్టం ఉన్న తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాల ద్వారా నీటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఏపిలోని అన్ని ప్రాంతాలకు నీరు చేరాలంటే తాము కూడా ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు సామర్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు.
కృష్ణా జలాల వివాదంపై… సామరస్యంగా పరిష్కరించుకుందాం..
కృష్ణా జలాల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాలు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి అదనంగా తాగు , సాగునీరు ఇవ్వడం లక్ష్యంగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి వరద రోజుల్లో ప్రస్తుతం ఉన్న 44వేల క్యూసెక్కులకు తోడుగా మరో 44 వేల క్యూసెక్కులకు నీటిని తరలించాలనే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లా ప్రాంతానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నాలుగు టిఎంసిల నీటికి వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనలు ప్రారంభం కావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో హంద్రీనీవా ఈఈ సుధాకర్ రెడ్డి,ఏఈ వేణుగోపాల్,వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చేరుకుచెర్ల రఘు రామయ్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భారత్ కుమార్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ ధర్మారెడ్డి,సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి ,నందికొట్కూరు అర్బన్ సిఐ నాగరాజ రావు,వైసిపి నాయకులు అయ్యన్న, వెంకటేశ్వర్లు, షూ కూర్ మియ్య,రఫీ ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.