వలసల నివారణకు.. ప్రణాళిక రూపొందించండి : కలెక్టర్ పి. కోటేశ్వర రావు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లోని కొన్ని ప్రాంతాల నుంచి వలసలు వెళుతున్న నేపథ్యంలో వలసల నివారణకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వలసల నివారణపై డ్వామా,ఇరిగేషన్, డి ఆర్ డి ఎ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, పశు సంవర్ధక, కార్మిక శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డా. మనజీర్ జిలాని సమూన్ తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరువు నేపథ్యంలో వలసల నివారణకు.. ఉపాధి హామీ పని దినాలను పెంచడం తో పాటు ఆర్థికంగా కుటుంబాలను ఆదుకునేందుకు జీవనోపాధుల పెంపు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు, పౌల్ట్రీ, డైరీ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు తదితర కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు నిర్దిష్టమైన సూచనలతో సమగ్రంగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు.
వలసల వివరాలు సేకరించండి.. జేసీ డా.మనజీర్ జిలాని
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డా. మనజీర్ జిలాని మాట్లాడుతూ ఏయే గ్రామం నుండి ఎంత మంది కూలీలు వలసలు వెళుతున్నా రో వివరాలు సేకరించాలని ఆదోని ఆర్డీవో , డి పి వోను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు సూచనలను కూడా తీసుకుని ఇందులో పొందుపరచాలని జేసీ సూచించారు. సమావేశంలో ఆదోని ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డ్వామా పిడి అమర్ నాథ్ రెడ్డి, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డి ఆర్ డి ఎ పి డి వెంకటేశులు, డి పి ఓ ప్రభాకర్ రావు, ఇరిగేషన్, పశు సంవర్థక, కార్మికశాఖ, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, డ్వామా ఏపిడిలు తదితరులు పాల్గొన్నారు.