ఉద్యోగులకు… న్యాయం జరిగేలా చూడండి..!
1 min readరాజ్యాంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించిన పీఆర్సీ సాధన సమితి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీ జీఓలను వెంటనే రద్దు చేసి.. ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని పీఆర్సీ సాధన సమితి సభ్యులు గణంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం కర్నూలు పాత బస్టాండ్లోని రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు విన్నవించారు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన, చెందాల్సిన 11 వ వేతన సవరణను ప్రకటించబడిన మధ్యంతర భృతికంటే తక్కువగా ప్రకటించడం, 5 ఏండ్లకు ఒక సారి ఇవ్వాల్సిన పీఆర్సీ ని 10 ఏండ్లకు పెంచుతాను అని ప్రకటించడం, సకాలంలో డి ఏ లు ఇవ్వకపోవడం, ఇంటిఅద్దె అలవెన్సుల్లో కోత పెట్టడం, CCA వంటి సౌకర్యాలు రద్దుచేయడం,. CPS రద్దు చేయకపోవడం, పదవీవిరమణ అనంతరం వయసును బట్టి రావాల్సిన… అదనపు పెన్షన్లను వయస్సు పెంచి రాయితీని దూరం చేయడం వంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విసిగివేసారి పోయిన ఉద్యోగులకు.. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమం వైపు అడుగులు వేసేలా ధైర్యం ప్రసాదించాలని కోరారు. అంతేకాక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనస్సు మార్చి పీఆర్సీ జీఓను రద్దు అయ్యేలా చూడాలని విన్నవించారు.
అనంతరం రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు వెంగళ్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణా నిధి మూర్తి, ఆప్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రకాశ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. సేవా నాయక్, యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు సురేష్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు గోకారి, డీటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుల రత్నం ఏసేపు,ఏపీఎన్జీఓస్ సెక్రటరి జనరల్ జవహర్ లాల్, ఏపీజీఈఎఫ్ జిల్లా అధ్యక్షులు రఘుబాబు, 4 జేఏసీల మెంబర్లు , పీఆర్సీ సాధన సమితి తదితరులు కోరారు.