PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు ప్రజా జీవితం రోజురోజుకు దుర్భరమవుతుంది…ఎస్.యు.సి.ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) – SUCI(C) పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్ విహార్ బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కర్నూలు నగర కార్యదర్శి ఎం తేజవతి  అధ్యక్షత వహించారు. ర్యాలీని ఉద్దేశించి ముఖ్య ఉపన్యాసకులుగా హాజరైన ఎస్.యు.సి.ఐ (సి) పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డి. రాఘవేంద్ర మాట్లాడుతూ – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా నేడు ప్రజా జీవితం రోజురోజుకు దుర్భరమవుతుందని అన్నారు. ఆర్థిక రాజకీయ సాంస్కృతిక నైతిక పతనం సామాజిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని దుయ్యబట్టారు. నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు, విద్యా, వైద్య వ్యాపారం, మహిళలపై అత్యాచారాలు వంటి సమస్యలు ప్రజలను దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నాయని వాపోయారు. పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదుల ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల ఫలితంగా 7 లక్షల 24 వేల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరిస్తున్నారని, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కుని కూడా ప్రైవేటీకరిస్తున్నారని తెలిపారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలందరూ కుల, మత, ప్రాంతాలకతీతంగా సంఘటితమై ప్రజా ఉద్యమాలలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం SUCI(C) పార్టీ కర్నూలు జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ – పేద, మధ్యతరగతి ప్రజలకు విద్యను దూరం చేస్తూ అశాస్త్రీయ, మూఢనమ్మకాలు, అందవిశ్వాసాలు వ్యాప్తి చేసే జాతీయ నూతన విద్యా విధానం (NEP) – 2020ని ప్రవేశపెట్టి విద్య యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. అలాగే విద్యుత్తును ప్రైవేటీకరించే లక్ష్యంతో విద్యుత్ సవరణ బిల్లు 2022ను ప్రవేశపెట్టి, వ్యవసాయ పంపుసెట్లకు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని, వివిధ పేర్లతో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై భారాలను మోపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల పోస్టులు భర్తీ చేయలేదని, లక్షలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కొరకు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ నిధులు ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామపంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు 18 నెలలుగా వేతనాలను చెల్లించడం లేదని, అలా చెల్లించకపోతే, వారు కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో SUCI (C) సభ్యులు ఎం.నాగన్న, ఖాదర్, విశ్వనాథ్ రెడ్డి, బాబు, అశోక్, రోజా, ప్రియాంక, మల్లేష్, శక్రప్ప, బీచుపల్లి, మహిళలు, కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

24వేలు, వ్యాప్తి, గ్రామపంచాయతీ, విద్యుత్​,

About Author