త్వరలోనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో త్వరలోనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. పుచ్చకాయలమడ గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నందుకే దేవుడు మనకు సీఎంగా చంద్రబాబు నాయుడును ఇచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడంతో ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు అడుగులు పడుతున్నాయన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచి లబ్దిదారులకు అందించడం జరిగిందన్నారు. పింఛన్‌దారులంతా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా టాప్‌లో ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ సీఎం చెప్పిన మాటలను స్పూర్తిగా తీసుకొని జిల్లా యంత్రాంగం మొత్తం కష్టపడి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక అన్న క్యాంటీన్లు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు మంత్రి చెప్పారు. పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ఇక టమోటా పంటను ఎక్కువగా సాగు చేసే ఈ ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ఉన్న వివాదాలను పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే యూనిట్ నెలకొల్పుతామన్నారు.