మానసికుల్లాసానికి పర్యాటక ప్రదేశాలు ఎంతో దోహదపడతాయి..
1 min read– జిల్లా పర్యాటక అధికారి హెచ్.డి మెహరాజ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలను జనవరి 25వ తేదీ బుధవారంనాడు గోపన్నపాలెంలోని హేలపురి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు వ్యాస రచన, పెయింటింగ్, డిబేట్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు, షీల్డులను జిల్లా పర్యాటక శాఖ అధికారి హెచ్.డి.మెహరాజ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఒడిదొడుకులు ఎదుర్కొనే మనిషి జీవితంలో మానసికోల్లాసానికి పర్యాటక ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయని అన్నారు. ఏలూరు జిల్లాలో పర్యాటక రంగం పుంజుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో అనేక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. పర్యాటకుల కోసం మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించిన విద్యార్ధులను ఆయన అభినందించారు. పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ పట్టాభిరామన్న మాట్లాడుతూ.. ప్రకృతిని ప్రేమిస్తే మనకు ఎంతో ఆహ్లాదకరమైన ఆనందానుభూతుల్ని ఇస్తుందని అన్నారు. విద్యార్ధులు అనేక ప్రాంతాలు పర్యటించి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్ధులు చదువుతోపాటు పర్యాటక ప్రాంతాలకు వెళ్తే మానసిక ప్రశాంతతతోపాటు చదువుపై ఏకాగ్రత వస్తుందని అన్నారు. జిల్లాలో కొల్లేరు, ఆటపాక, బుద్ధిజం ప్రాంతాలు, పాపికొండలు, బోటింగ్ .. వంటి ఎన్నో మానసిక ప్రశాంతతను ఇచ్చే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. కరోనా పరిస్థితుల తర్వాత పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా నెహ్రూ కేంద్రం యూత్ ఆఫీసర్, డి.కిశోర్ మాట్లాడుతూ.. విద్యార్ధులు ప్రకృతిని ప్రేమించాలని అన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ చదువులో రాణించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు విలువైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, ఏఓ టీ.ఎస్ కరుణానిధి, సీనియర్ ప్రొఫెసర్లు ఎమ్.శ్రీనివాసరావు, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.