చింతలముని స్వామి రథోత్సవంలో విషాదం..
1 min read– కలశంకు విద్యుత్ తీగలు తగిలి… ఇద్దరి మృతి
పల్లెవెలుగు వెబ్, ఆదోని టౌన్ : కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని పెసల బండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని పెసల బండ గ్రామంలో బుధవారం చింతల మునిస్వామి రథోత్సవం జరుగుతోంది. ఉదయం 9.30 గంటలకు స్వామి రథోత్సవం జరుగుతుండగా.. రథోత్సవంపై ఉన్న కలశం విద్యుత్ తీగలు తగిలింది. ఈ ఘటనలో శెట్టి బలిజ వెంకటేష్, విద్యార్థి వీరాంజనేయులు మృతి చెందారు. గోపాల్, ఆంజనేయులు, సాయితేజకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ విజయలక్ష్మి, జయ మనోజ్ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పట్టించుకోకపోవడం.. ఆలయ కమిటీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పెసలబండ గ్రామస్తులు కోరారు.