ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ…
1 min read
ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి
పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల విధులపట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం స్దానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఈనెల 27వ తేదీన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభధ్రుల ఎన్నికల సందర్బంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పివో, ఎపివో లకు రెండో విడత శిక్షణాతరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సులు తెరవడం, సీల్ చేయడం వంటి అంశాలపై క్షుణంగా అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి ఎన్నికల సిబ్బంది నుంచి సమాధానాలను కలెక్టర్ రాబట్టారు. ఈ సందర్బంగా వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈనెల 27వ తేదీన ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగియుండాలన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35 మంది అభ్యర్ధులు పోటీల్లో ఉన్నారని వివరించారు. అందుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ ను ఏ విధంగా మడతపెట్టి బ్యాలెట్ బాక్సులో వేసే విధానం గురించి వివరించారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్వీకరణ, స్టాట్యూటరి, నాన్ స్టాట్యూటరి కవర్లు, పోలింగ్ మెటీరియల్స్ చెక్ లిస్టు ప్రకారం పరిశీలించుకుని తీసుకోవాలన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభధ్రుల ఎన్నికలకు 3,14,984 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో 62 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్లు కలిగియున్నారని ఇందులో పురుషులు 24,704 మంది, మహిళలు 17,571 మంది, ట్రాన్స్ జెండర్లు 7 గురు ఉన్నారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సంబంధించి పివో, ఏపివోలు ఎన్నికల కమీషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా చదివి అవగాహనతో పకడ్బందీగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను ముగించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మరి ముఖ్యంగా బ్యాలెట్ బాక్సు ఆపరేటింగ్, బ్యాలెట్ పేపర్లు పరిశీలన, పివో డైరీ నిర్వహణ ముఖ్యమైన ఘట్టాలని తెలిపారు. గత ఎన్నికల్లో అనుభవాన్ని జోడించి సజావుగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు.ఈ శిక్షణాతరగతుల్లో మాస్టర్ ట్రైనిస్ శ్రీనివాస్, ఫణి వారిచే ఓటు వేసే విధానంపై , పోలింగ్ సిబ్బంది నియామకం, పోలింగ్ మెటీరియల్స్, ముఖ్యమైన ఎన్నికల సామాగ్రి తనిఖీ, పోలింగ్ కేంద్రానికి చేరిన వెంటనే చేయాల్సిన విధులు, పోలింగ్ రోజు విధులు, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మొదటి, రెండు పోలింగ్ కేంద్రాల పోలింగ్ అధికారి విధులు, పోలింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, పోలింగ్ కేంద్రంలోని ప్రవేశ అర్హత, ఓటరు జాబితా,ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, అంధులు మరియు నిస్సహాయ ఓటర్లు, బ్యాలెట్ బాక్సు సిద్ధం చేయడం, పోలింగ్ ఏజెంట్లు గమనించాల్సిన అంశాలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్నికల అధికారులకు బ్యాలెట్ బాక్సు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ప్రాక్టికల్ గా కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం.ముక్కంటి, పివో, ఏపివోలు తదితరులు పాల్గొన్నారు.
