పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం…
1 min read– ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
– కార్యదర్శులు ప్రజల సమస్యలను సహనంతో విని పరిష్కరించాలి..
– మనమంతా ప్రజా సేవకుల మన్న విషయాన్ని మరువకూడదు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : సచివాలయానికి వచ్చే ప్రజల అవసరాలను, సమస్యలను ఓపిగ్గా విని మీ స్ధాయిలో చేయగలిగింది చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పంచాయితీ కార్యదర్శులకు హితువు పలికారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రేడ్-1 నుంచి గ్రేడ్- 5 పంచాయతీ కార్యదర్శులు 821 మందికి నాలుగు బ్యాచులు గా ఆరు అంశాలపై నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనమంతా ప్రజా సేవకులమనే విషయాన్ని మరవకుండా మన దగ్గరికి వచ్చే ప్రజలు వారి సమస్య చెప్పేదాకా ఓపిగ్గా వినాలన్నారు. సచివాలయంలో మీస్ధాయిలో చేయగలిగింది చేయాలని కానీ పక్షంలో సంబంధిత తహశీల్దారు, డిఎల్ డిఓ, ఆర్డిఓలను కలువమని చెప్పవచ్చన్నారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో లేరనే మాట రాకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాస్ధాయి స్పందనకు వచ్చే ప్రజలు తమ సమస్య పరిష్కారానికి సచివాలయంలో కార్యదర్శులు అందుబాటులో లేరనే మాట వినబడకూడదన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయని దానికి అనుగుణంగా ప్రజలకు మన సేవలు అందజేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయితీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. గ్రామ సచివాలయానికి డిడిఓ లాంటి వారని ఆయన పేర్కొన్నారు. నవరత్నాలు కార్యక్రమంలో లబ్దిదారుల గుర్తింపు, పధకాల అమల్లో, జెకెసి ఆడిట్ వంటి కార్యక్రమాలు సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని సమర్ధవంతమైన సేవలను అందించాలన్నారు. మరి ముఖ్యంగా శిక్షణా కార్యక్రమంలో రెండు రోజులు రీ సర్వేపై ఇచ్చే శిక్షణను జాగ్రత్తగా విని ఫీల్డ్ పైకి వెళ్లినపుడు ఎలా మెలగాలో తెలుసుకోవాలన్నారు. ఈశిక్షణానంతరం లక్ష్యాలను కూడా నిర్ధేశించడం జరుగుతుందని ఈ దృష్ట్యా చాలా జాగ్రత్తగా శిక్షణలో తెలిపే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా వినాలన్నారు. స్పందనలో ఎక్కువగా పారిశుధ్యం, ఆక్రమణలుపై ఎక్కువగా పిర్యాదులు వస్తుంటాయన్నారు. ఈ దుష్ట్యా ఆక్రమణలకు సంబంధించి అనుసరించాల్సిన అంశాలను క్షుణంగా తెలుసుకోవాలన్నారు. పంచాయితీ కార్యదర్శులు ఎండార్స్ మెంట్ ఇవ్వకూడదని ఈవో ఆర్డిఓలు, యంపిడివోలు ఇవ్వాలన్నారు. మరోప్రక్క పన్ను వసూళ్లు, లే అవుట్లకు సంబంధించిన అంశాలను క్షుణంగా తెలుసుకోవాలన్నారు. బిఎల్ఓ లుగా వ్యవహరించే కార్యదర్శులు అందుకు సంబంధించి అంశాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు సంబంధించి ఫారం-6,7,8 ముఖ్యంగా మరణించిన ఓటర్లను తొలగించే విషయంపై కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. శిక్షణా కార్యక్రమంనకు సంబంధించి శిక్షణకు తదుపరి రోజు అందించే అంశాలను ముందురోజు వారికి తెలియజేస్తే ఆఅంశాలను వారు చదువుకొని వస్తారని తద్వారా ఆయా అంశాలపై వారికి పూర్త పట్టు కలుగుతుందన్నారు. జిల్లా పంచాయితీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 821 మంది పంచాయితీ కార్యదర్శులకు ఈనెల 29 నుండి వచ్చేనెల 30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లాకు చెందిన 423 మంది, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 350 మంది శిక్షణలో పాల్గొంటారన్నారు. ఒక్కొక్క బ్యాచ్ కు మొత్తం ఆరు రోజులు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఏలూరు లో అందించడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీ పరిపాలనకు సంబంధించి మొత్తం ఆరు అంశాలపై ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో కొత్తగా లేఅవుట్ల ఏర్పాటుకు అమలులో ఉన్న నిబంధనలతో పాటు పరిపాలనకు సంబంధించిన ఆరు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నమన్నారు. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష కార్యక్రమంలో గ్రామకంఠం పరిధిలో ఇళ్ల యాజమానులకు హక్కు పత్రాల జారీకి సంబంధించిన అంశాలు క్షేత్రస్థాయిలో “సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన ఉపాధి హామీ పథకం కార్యక్రమాలు ఉద్యోగుల విధి నిర్వహణకు సంబంధించి క్రమశిక్షణ చర్యలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల అంశాలపై ఈ శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ, శిక్షణా కో-ఆర్డినేటర్ ప్రసంగిరాజు, డిఎల్ డిఓ మరియు కో-ఆర్డినేటర్ శిరీషా, తదితరులు పాల్గొన్నారు.