పేదలకూ ఏసీ బోగీలో ప్రయాణం !
1 min readపల్లెవెలుగువెబ్ : పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్కువ చార్జీలతో ఏసీ బోగీలతో కూడిన రైళ్లను ప్రవేశపెట్టేందుకు దక్షిణరైల్వే ఏర్పాట్లు చేసింది. ‘పేదల రథం’ పేరుతో ఆధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పోల్చుకుంటే చార్జీలు స్వల్పం, సౌకర్యాలు అధికం కావడం వల్ల ప్రయాణికులు రైలు ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ కారణంగా రిజర్వేషన్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతో టిక్కెట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో రెండు లేదా మూడు ఏసీ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిని టూ టైర్, త్రీ టైర్ బోగీలుగా విభజించి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిల్లో కుర్చీల సంఖ్య కూడా పరిమితంగా ఉన్నందున ఏసీ బోగీల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని నివారించి ఏసీ బోగీలను కింది, మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైళ్లకు “పేదల రథం’ అని పేరుపెట్టారు.