టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారేది నేడే !
1 min readపల్లెవెలుగువెబ్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్).. భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారేందుకు సర్వం సిద్ధమైంది. పార్టీ పేరు, పరిధిని మార్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు తొలుత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులేంటి అన్నది వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రాంతీయ పార్టీల పట్ల ఆ పార్టీ వైఖరిని వివరించనున్నారు. తమ జాతీయ పార్టీ లక్ష్యాలు, అజెండాను వెల్లడించనున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్న మొత్తం 283 మంది.. టీఆర్‌ఎస్ పార్టీ మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ నోట జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన రానుంది.