బెలుం సింగవరంలో ముగిసిన టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామం లోని శ్రీ రామాలయం నందు జరిగిన ధార్మిక ప్రవచనం, భజన ,గోపూజ కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. మూడు రోజుల పాటు రామాయణం, మహాభారతం, భగవద్గీతలలోని ధర్మసూక్ష్మాలను-మానవుడి కర్తవ్యాన్ని గురించి ప్రవచకులు వై.వి.ఎస్ నారాయణరెడ్డి భక్తులకు తన ఉపన్యాసం ద్వారా తెలియజేశాడు. స్థానిక భజన మండలిచే నాలుగు రోజుల పాటు భజనలు నిర్వహించారు. చివరిరోజు ముక్కోటి దేవతా స్వరూపమైన గోవుకు పూజతో పాటు నగరంసంకీర్తనలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశమని, వ్యవసాయానికి ఆధారభూతమైనది గోవు అని, అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు భారతీయ సనాతన ధర్మాన్ని సంరక్షించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, అందులో భాగంగానే గుడికో గోమాత పథకం ప్రతి జిల్లాలో జరుగుతున్నదని ఆసక్తి కలిగిన ఆలయాల నిర్వాహకులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రభావతమ్మ ,తిప్పారెడ్డి, సమరసతా సేవా ఫౌండేషన్ మాజీ మండలం ప్రచారకులు లోటావత్ రాముడు నాయక్, తితిదే ధర్మాచార్యులు కుమ్మరి భవానీ , దేవాలయ కమిటీ అధ్యక్షులు తిమ్మారెడ్ఠి, కార్యదర్శి శివరామిరెడ్డి, హరి ,వెంకట రమేశ్, నాయుడు, వీరనాథరెడ్డి, పుల్లన్న పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.