వాయునాళంలో కణితి.. పనిచేయని ఊపిరితిత్తులు
1 min read
వృద్ధుడికి గాలి ఆడక విపరీతమైన ఆయాసం
సంక్లిష్టమైన చికిత్సతో నయం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు
అనంతపురం, న్యూస్ నేడు : నగరానికి చెందిన కేశవరెడ్డి అనే 64 ఏళ్ల వృద్ధుడికి ఏడాది నుంచి విపరీతమైన దగ్గు, ఆయాసం వస్తున్నాయి. 20 రోజుల నుంచి జ్వరం రావడం, బరువు తగ్గిపోవడంతో పాటు ఆయాసం కూడా విపరీతంగా పెరిగింది. ఏమాత్రం ఊపిరి కూడా అందని పరిస్థితుల్లో అతడు కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చాడు. అతనికి పరీక్షలు, చికిత్స చేసిన కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “కేశవరెడ్డిని పరీక్షించినప్పుడు ఎడమ ఊపిరితిత్తికి వెళ్లే ప్రధాన వాయుమార్గం పూర్తిగా మూసుకుపోవడంతో అది పనిచేయడం మానేసిందని తెలిసింది. వెంటనే పునరుద్ధరించకపోతే ఊపిరి ఆడడం మరింతగా తగ్గిపోతుంది. బ్రాంకోస్కోప్ సాయంతో సమగ్రంగా పరీక్షించగా.. ఎడమ ఊపిరితిత్తికి దారితీసే ప్రధాన మార్గాన్ని అడ్డుకుంటూ ఒక పెద్ద కణితి ఏర్పడిందని గుర్తించాం. దాంతో అసలు అందులోకి గాలి వెళ్లే మార్గమే లేదు. ఫలితంగా ఊపిరితిత్తిలోని పైన, కింద భాగాలు రెండూ పూర్తిగా మూసుకుపోయాయి. సాధారణ బ్రీతింగ్ ట్యూబ్‌లు కూడా లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
ఎలా చేశారంటే…
మూసుకుపోయిన వాయు మార్గాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరవాలని వైద్యబృందం నిర్ణయించింది. ముందుగా రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరంతో జాగ్రత్తగా ఆ కణితిని తొలగించడం ప్రారంభించాం. ఇందుకోసం ఎలక్ట్రోకాటెరీ (వేడి చేయడం), క్రయోథెరపీ (చల్లార్చడం) అనే పద్ధతులు ఉపయోగించాం. ప్రత్యేకంగా ఫోగర్టీ కాథెటెర్ అనే బెలూన్ సాయంతో రక్తస్రావం కాకుండా జాగ్రత్త పడ్డాం. ఈ పద్ధతుల ద్వారా అత్యంత సురక్షితంగా ఆ కణితిని తొలగించాము. అది క్యాన్సరా, మరేదైనా ఇన్ఫెక్షనా అని తెలుసుకునేందుకు బయాప్సీకి పంపించాం. గణనీయమైన మార్పు ఈ కణితిని తొలగించిన తర్వాత వెంటనే కేశవరెడ్డికి ఆయాసం మొత్తం తగ్గిపోయి, ఊపిరి అందడం మొదలైంది. ఊపిరితిత్తి కూడా మళ్లీ పనిచేయసాగింది. కొన్ని మందులు వాడి, తగిన సంరక్షణతో చూసుకున్న తర్వాత.. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, ఊపిరి కూడా బాగా అందుతుండడంతో ఆయనను డిశ్చార్జి చేశాం. అస్సలు ఊపిరి ఆడని పరిస్థితిలో వచ్చిన కేశవరెడ్డి.. హాయిగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు.
సాంకేతిక పరిజ్ఞానం కీలకం
పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం లేకుండానే ఊపిరిని పునరుద్దరించి ప్రాణాలు కాపాడేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ఈ కేసు నిరూపించింది. కణితులు, ఇన్ఫెక్షన్లు, మరేదైనా పరిస్థితి వల్ల వాయుమార్గంలో అడ్డంకులు ఏర్పడేవారికి ఇలాంటి సాంకేతికత ఒక వరంలా ఉపయోగపడుతుంది” అని డాక్టర్ యశోవర్ధన్ చెప్పారు.