మార్పిడి చేసిన కిడ్నీలో కణితి!
1 min read* 42 ఏళ్ల ఖమ్మం వ్యక్తికి అరుదైన సమస్య
* రక్తనాళాల క్లాంపింగ్ లేకుండానే రోబోటిక్ శస్త్రచికిత్స
* ఏఐఎన్‌యూ వైద్యుల అసాధారణ ఆపరేషన్
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ఎప్పుడో దాదాపు పన్నెండేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఓ వ్యక్తికి.. ఇప్పుడు మార్చిన కిడ్నీలో ఓ కణితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని నల్లగండ్ల ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల వ్యక్తికి 2007 సంవత్సరంలో రెండు కిడ్నీలు విఫలం కావడంతో అప్పట్లోనే వేరే ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స చేసి, ఒక కిడ్నీని అమర్చారు. అతడి సోదరుడే కిడ్నీ దానం చేశారు. అలా అమర్చిన కిడ్నీలో తాజాగా కణితి ఏర్పడింది. దాంతో అతడు నగరంలో యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు ప్రసిద్ధి చెందిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రికి వచ్చాడు. అతడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సి. మల్లికార్జున, డాక్టర్ ఎస్ఎం గౌస్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “దాదాపు పన్నెండేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఈ రోగికి ఇటీవల అందులో కణితి రావడంతో మా వద్దకు వచ్చాడు. అతడికి తగిన వైద్య పరీక్షలు చేయగా, కణితి ఉన్న విషయం నిర్ధారణ అయ్యింది. సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో కిడ్నీకి వెళ్లే రక్తనాళాలను క్లాంపింగ్ చేసి, అంటే రక్తసరఫరా ఆపేసి అప్పుడు కిడ్నీకి కోత పెట్టి కణితి తొలగించాలి. తర్వాత మళ్లీ మొత్తం కుట్లు వేయాలి. దానివల్ల దీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు రక్తప్రసారం ఎక్కువసేపు ఆగిపోవడం వల్ల కిడ్నీ వైఫల్యానికి దారి తీయొచ్చు. ఇలా అనేక సమస్యలు ఉంటాయి. అందువల్ల ఏఐఎన్‌యూలో ఉన్న అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత, రోబోటిక్ శస్త్రచికిత్స ప్రారంభించాం. ఇందులో అత్యంత సున్నితత్వంతో చేయడం వల్ల రక్తప్రసారాన్ని ఆపాల్సిన అవసరం రాలేదు. అతి చిన్న కోత పెట్టి కణితిని విజయవంతంగా తొలగించాం. అనంతరం మళ్లీ కుట్లు వేసేశాం. దీనివల్ల రోగి ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం చాలా తగ్గిపోయింది. రోగి త్వరగా కోలుకున్నారు. ఆయన క్రియాటినైన్ స్థాయి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పుడు తన పనులన్నీ సాధారణంగా చేసుకుంటున్నారు” అని వివరించారు. యూరాలజీ విభాగంలో రోబోటిక్స్ వినియోగానికి సంబంధించిన అసాధారణ విజయమిది. ఏఐఎన్‌యూ శస్త్రచికిత్స నిపుణుల బృందం నైపుణ్యం, సామర్థ్యాలకు ఈ అరుదైన శస్త్రచికిత్స ప్రతీకగా నిలిచింది. తద్వారా వినూత్నమైన శస్త్రచికిత్స సాంకేతికత విషయంలో ఏఐఎన్‌యూ మరోసారి నాయకత్వ స్థానం సాధించింది. ఈ అసాధారణ చికిత్సలో విజయం సాధించడం వల్ల సంక్లిష్టమైన యూరలాజికల్ సమస్యలకు రోబోటిక్ శస్త్రచికిత్సలు ఎలా ఉపయోగపడతాయన్నది మళ్లీ రుజువైంది.