అవసరమైతేనే… రోడ్లపై తిరగండి..
1 min read– కడప ఎస్పీ అన్బురాజన్
పల్లెవెలుగు వెబ్, కడప: కర్ఫ్యూ నేపథ్యంలో అవసరమైతే తప్పా.. బయటకు రావద్దని కడప జిల్లా ఎస్పీ కేకే ఎన్ అన్బురాజన్ ప్రజలకు సూచించారు. అనవసరంగా తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం నగరంలోని ఏడు రోడ్ల కూడలి, పాత బస్టాండ్, కోటి రెడ్డి సర్కిల్, ఎర్రముక్కపల్లి ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితులను పరిశీలించారు. ఎర్రముక్కపల్లి సర్కిల్ వద్ద రోడ్డు పై వెళుతున్న వాహనదారులను నిలిపి ఎక్కడికి, ఏ పని నిమిత్తం వెళుతున్నదీ.. ఆరా తీశారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు/ సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. జిల్లా ఎస్.పి వెంట కడప వన్ టౌన్ సి.ఐ టి.వి సత్యనారాయణ ఉన్నారు.