మహానందిలో వసతి గృహాలు కూల్చే సమయంలో ఇద్దరు మృతి
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది క్షేత్రంలోని నాగనంది వసతి గృహాలు కూల్చే సమయంలో మంగళవారం ఇద్దరు మృతి చెందారు. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు కందికాయ పల్లె సుబ్బరాయుడు(60) అక్కడికక్కడే మృతి చెందగా వడ్డే వెంకటేశ్వర్లు(50) ప్రమాద సమయంలో గాయపడగా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక అక్కడ మృతి చెందారు. మృతుల్లో సుబ్బరాయునికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉండగా వెంకటేశ్వర్లు కు భార్య మరణించగా ముగ్గురు కుమారులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరందరూ కూలీలు గానే పనిచేస్తున్నట్లు సమాచారం. మహానంది దేవస్థానం పరిధిలోని నాగనంది వసతి గృహాలను కూల్చివేసేందుకు దేవాదాయ కమిషనర్ నుంచి ఆదేశాలు రావడంతో కూల్చివేతకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం గత ఐదు రోజుల నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేత సమయంలో గతంలో వసతి గృహాలు నిర్మాణానికి సహకరించిన దాతలకు సమాచారం వసతి గృహాలను కూల్చివేస్తున్నట్లు తెలియజేయలేదని దాతల నుండి ఆరోపణలు వినవస్తున్నాయి. సంఘటన స్థలాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి, ఏ ఈ ఓ మధు, మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి పరిశీలించి గాయపడ్డ వ్యక్తిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెదేపా నాయకుడు బన్నూరు రామలింగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల ఇద్దరిని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని శవాగారానికి తరలించారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా… మహానంది క్షేత్రంలోని నాగనంది వసతి గృహాలు కూచివేత సమయంలో ఇద్దరు మృతి చెందిన సంఘటనకు సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
