త్యాగమూర్తి…బాలసాయిబాబా : మేయర్
1 min read• అట్టహాసంగా బాలాసాయి 62వ జన్మదిన వేడుకలు
• హాజరైన ప్రముఖులు, విదేశీయులు
• కర్నూలులో తాగునీటి సమస్య నివారణకు మున్సిపాలిటీకి రూ.10 కోట్లు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: భగవాన్ శ్రీ బాలసాయి సేవ దృక్పథం అందరికీ అనుసరణీయం అని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. శనివారం బాలాసాయి 62వ జన్మదినోత్సవం పురస్కరించుకుని భగవాన్ శ్రీ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ అధ్వర్యంలో పాత బస్టాండ్ సాయిబాబా గుడి పక్కనున్న శ్రీ నిలయంలోని బాలసాయి మందిరంలో జరిగిన జన్మదిన వేడుకలకు మేయర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీమణి ఎస్వి విజయమనోహరి హాజరయ్యారు. ముందుగా బాలసాయి సమాధికి సందర్శించారు. అనంతరం వేదికపై బాలసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు 700 మందికి జీవనోపాధి కల్పించడం కోసం తోపుడు బండ్లు, ఇస్ట్రి పెట్టేలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు, టి స్టాల్ స్టాండ్లు వంటి సామాన్లను అందజేశారు. అలాగే ఆర్కా, అమ్మ, ఓమిని ఆసుపత్రుల సహాకారంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, ఉచితంగా మందులు అందజేశారు.
పేదల కోసం… బాలసాయిబాబా జీవితం త్యాగం..
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి బాలసాయి అన్నారు. ఆయనను భగవంతుడు త్వరగా పిలుచుకున్నప్పటికి, ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలుస్తుందన్నారు. బాలసాయి ట్రస్ట్ నడుపుతూ అనేక మందికి అండగా నిలుస్తున్న ఆయన శిష్యుల తీరు అభినందనీయం అన్నారు. బాలసాయి కర్నూలులో జన్మించడం ప్రజల అదృష్టమని, అయన వల్ల కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు, విదేశీయులు ఎందరో కర్నూలును సందర్శించారని కొనియాడారు. ట్రస్ట్ నేడు ప్రపంచ శాంతి దినంగా జరపడం సంతోషకరమని, ఇలాంటి సేవ కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.
కర్నూలు ప్రజల దాహార్తి తీర్చేందుకు.. రూ.10 కోట్లు..
కర్నూలు నగరంలో తాగునీటి ఎద్దడి ఎక్కువైందని, వాటి నివారణకు, తమ సహాకారం కావాలని, భగవాన్ శ్రీ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ మేనేజర్ టి.రామరావును మేయర్ బీవై రామయ్య కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించి 10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వేదికపై కర్నూలు నగర పాలక సంస్థ మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రామారావును మేయర్ సత్కరించారు.