PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్​

1 min read

మిచాంగ్ తుఫాను పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి..

విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితో యుద్ధ ప్రాతిపధికపై వాటిని సరిచెయ్యాలి..

విద్యుత్, పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమవ్వయంతో పనిచేయాలి..

జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : మిచాంగ్ తుఫాను పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం మిచాంగ్  తుఫాను దృష్ట్యా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ప్రభావిత జిల్లాల  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా  కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి పాల్గొన్నారు. వీరితోపాటు ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. ఎస్.ఎస్. రాజు, తదితరులు పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను దృష్ట్యా సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు వేగవంతమైనగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.  తీవ్రగాలులు మూలంగా విద్యుత్ స్ధంబాలు ఒరగడం, పడిపోవడం వంటవి సంభవించవచ్చని ఈ దృష్ట్యా వాటిని తిరిగి యుద్ధ ప్రాతిపధికన పునరుద్దరించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వాటిని సరిచెయ్యాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.    అధిక నీటి ప్రవాహం ఉన్న రహదారులు, బ్రిడ్జీలు , వాగులు, నదులు, దాటడానికి ఎవ్వరూ ప్రయత్నం చేయకుండా ప్రత్యేక పోలీస్ పహారా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్ సూచించారు. శిధిలావస్ధలో ఉన్న భవనాల్లో ఎవరైనా ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. బలహీనంగా ఉన్న ఇంటిగోడలు, కరెంటు స్ధంబాలు, ట్రాన్స్ ఫారంలు, చెట్లకింద ఎవరూ ఉండవద్దని ఆయన సూచించారు.  బలమైన ఈదురు గాలులవల్లప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.  మిచౌంగ్ తుఫాను పరిస్ధితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాగానికి, పోలీసు వారికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.  తుఫాను పరిస్ధితులను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన అనంతరం పారిశుద్ధి పరిస్ధితులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  తుఫాను హెచ్చరికలు కారణంగా జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమై కొత్తగా రాబడిన, అమ్ముకొనేందుకు సిధంగా ఉన్న ధాన్యాన్ని పూర్తిగా ఆఫ్ లైన్ చేసి తగిన జాగ్రత్తలతో రైస్ మిల్లులకు చేరేందుకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు క్షేత్రస్ధాయి పర్యవేక్షణ నిమిత్తం మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. తుఫాను దృష్ట్యా విద్యాసంస్ధలకు శెలవు.  మిచాంగ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యా సంస్ధలకు సోమవారం మధ్యాహ్నం, మంగళవారం శెలవు ప్రకటించడమైందని తెలిపారు. రైతులకు అండగా నిలబడాలి.. సియం. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగమంతా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడటంతోపాటు సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు.  ప్రస్తుతం కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని యుద్ధ ప్రాతిపధికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.  తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవాలని తుఫాను దృష్ట్యా రైతులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.  ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు.  తుఫాను వర్షాలు తగ్గాక పంటకు జరిగిన నష్టాలపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలన్నారు.

About Author