PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాలలో..‘ఉగాది’ సంబరాలు

1 min read

సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్న జిల్లా అధికారులు

కరణం సుధీంద్ర ఆచారి ఉగాది పంచాంగ శ్రవణం

పల్లెవెలుగు వెబ్​, నంద్యాల: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ అత్యంత  శోభాయమానంగా ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ఆకాంక్షించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసా, డిఆర్ఓ పుల్లయ్య, డిసిఎంఎస్ చైర్మన్ సి.హెచ్ శిరోమణి మద్దయ్య, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ ఇతర జిల్లా అధికారులు ఈ పాల్గొన్నారు.

పూర్ణకుంభంతో.. కలెక్టర్​కు స్వాగతం..

అంతకుముందు కలెక్టరేట్ ఆవరణ నుండి వీడియో కాన్ఫరెన్స్ హాల్ వరకు మంగళ వాయిద్యాల మధ్య జిల్లా కలెక్టర్ కు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో తొలుత కరణం సుధీంద్ర ఆచారి శాస్త్రోక్తంగా గణపతి పూజ నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం పంచాంగ శ్రవణం గావిస్తూ యుగమునకు ఆది ఉగాది అని…. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ఈరోజు నుంచే ప్రారంభించారని… పంచాంగం అంటే తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం తదితర విషయాలన్నింటినీ ప్రతి ఒక్కరూ తెలుసుకొని జీవితంలో అభివృద్ధి చెందాదాలన్నారు. చైత్రమాసం నుండి ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరంలో 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు స్థితిగతులు తదితర విషయాలను పంచాంగ శ్రవణం ద్వారా వివరించారు.

నంద్యాల ప్రజలు.. సుఖసంతోషాలతో ఉండాలి :కలెక్టర్​      

జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి అత్యంత  శోభాయమానంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనమై ఉగాది పచ్చడి అందరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నారు. ఉగాది పండుగ పర్వదినం ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసి అనిర్విచమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ అన్ని శుభాలే కలగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తూ అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. 

అర్చకులకు ఉగాది పురస్కారాల ప్రదానం

దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం నుండి జిల్లాకు చెందిన కోటపాడు గ్రామ శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ అర్చకులు శ్రీనివాసులు, నంద్యాల పట్టణంలోని శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవాలయ అర్చకులు రాచకొండ మురళీకృష్ణ శర్మ, నొస్సం గ్రామ శ్రీ బుగ్గ వెంకటేశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయ అర్చకులు పెట్టిన కోట శ్రీకాంత్ శర్మలకు రూ.10,116/- ల పారితోషికం, ప్రశంసా పత్రం, కండువాలను జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, సాంప్రదాయ రీతి ప్రసాదాలను వేడుకల్లో హాజరైన అందరికీ పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో డిఎంహెచ్ఓ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, డీఎస్ఓ ఆచార్యులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author