ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రాల ఆకస్మిక తనిఖీ
1 min read– రైతుల పంటలను ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయండి
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్పల్లెవెలుగు వెబ్ నంద్యాల: వెలుగోడు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో పెండింగ్లో ఉన్న పనులు వారం రోజుల్లో పూర్తిచేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడిసి ఈఈని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. గురువారం వెలుగోడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేస్తూ డాక్టర్లు ఎఫ్అర్ఎస్ అటెండెన్స్ వేస్తున్నారా, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా, లక్ష్యం మేరకు ప్రసవాలు జరుపుతున్నారా, పేషెంట్లకు యాంటీబయోటిక్ ఇస్తున్నారా తదితర విషయాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ అనుసంధానం చేసుకొని పేషంట్లను బయటికి పంపకుండా సి హెచ్ సి సెంటర్ లోనే మెరుగైన వైద్య సర్వీసులు అందించాలన్నారు. పేషంట్లను జిల్లా ఆస్పత్రులకు పంపకుండా అక్కడే అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు వైద్యచికిత్సలు కూడా అందించాలన్నారు. ఈసీజీ, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలన్నింటిని ల్యాబ్ లలో తప్పనిసరిగా చేపట్టాలన్నారు. ఎన్ఐసీయూ హోమియోపతి యూనిట్ ను కూడా కలెక్టర్ తనిఖీ చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేస్తూ రసాయనిక ఎరువుల స్టాక్ వివరాలు, ఈ క్రాఫ్ బుకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగునీటి కాలువల కింద ఉన్న రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ సూచించారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తరచూ తనిఖీలు చేయాలన్నారు. వెలుగోడు మండల తాసిల్దారు ఎంపీడీవో కలెక్టర్ వెంట ఉన్నారు.