కమ్యునిస్టుల ముసుగులో… భూ కబ్జాదారులు
1 min readరూ.50 కోట్ల విలువ చేసే దేవాలయ భూమిని కబ్జా చేసిన భూబకాసురులు
జొహరాపురంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయం భూమి కబ్జా చేసిన సీపీఐ నాయకులు
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి
పల్లెవెలుగు వెబ్: కర్నూలు మండలం జొహరాపురంలో దాదాపు రూ. 50 కోట్ల విలువ చేసే ఎండోమెంట్ భూమిని కమ్యునిస్టుల ముసుగులో ఉన్న సీపీఐ నాయకుల కబ్జా చేశారని ఆరోపించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. సమాజానికి నీతులు బోధించే కమ్యునిస్టులు దేవాలయ భూమిని ఎలా కబ్జా చేస్తారంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. పార్థసారధి మాట్లాడారు. జొహరాపురంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంకు సంబంధించి.. నందికొట్కూరు రోడ్డు వైపు సర్వేనంబరు 123లో 7.72 ఎకరాలు కబ్జా చేసి… ప్లాట్లుగా వేసి… పంచుకున్నారని, ఈ విషయం రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కబ్జా చేసిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం… త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదన్నారు.
దేవాలయ భూములకు రక్షణేదీ..?
రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు, దేవాలయాలకు సంబంధించిన భూమి, వాటి ఆదాయంకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. దేవాలయ భూములను కబ్జా చేస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం పట్టనట్లు ఉంటూ పరోక్షంగా భూబకాసురులకు మద్దతు ఇస్తోందని ఘాటుగా విమర్శించారు. హిందూ దేవాలయ భూములను కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం వల్ల కాకపోతే… చెప్పండి… కాపాడుకునే విధానం మాకు తెలుసన్నారు. సమావేశంలో బీజేపీ జోనల్ ఇన్చార్జ్ మురళీ కృష్ణ నాయుడు, కాళింగ శంకర్ శర్మ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.