చెరువులకు మరమ్మతులు.. పునరుద్ధరణ పనులు చేపట్టండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ఉన్న చిన్న నీటిపారుదల చెరువులకు మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో రిపేర్స్, రెనోవేషన్, రెస్టోరేషన్ (ఆర్ఆర్ఆర్) స్కీమ్ పై మైనర్ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ శివప్రసాద్ రెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర ప్రసాద్, పరిశ్రమల శాఖ జిఎం జవహర్ బాబు, భూగర్భ జల డిప్యూటీ డైరెక్టర్ రఘునాథ్, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ చిన్న నీటిపారుదల చెరువులకు మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ఆర్ఆర్ఆర్ స్కీమ్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అందుకు ముందుగా జిల్లాలో మరమ్మత్తు, పునరుద్ధరణ చేయాల్సిన ట్యాంకులను గుర్తించి ఎకరాకు లక్ష రూపాయలు మించకుండా ఖర్చు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న 116 ఇరిగేషన్ చెరువులకు సంబంధించి 91 ట్యాంకుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు గుర్తించి ప్రతిపాదలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర నిధుల నుండి 40 శాతం ఖర్చు చేస్తే 60 శాతం నిధులు కేంద్రం నుండి నిధులు మంజూరు అవుతాయన్నారు.